ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు బ్రేక్.. ఆ గ్రామస్తుల్లో సంబరాలు
తమ పచ్చని పొలాల్లో ఇథనాల్ మంట పెట్టొద్దని నిర్మల్ జిల్లా రైతులు నిరసనకు దిగారు. నిన్న పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు
By: Tupaki Desk | 27 Nov 2024 9:36 AM GMTతమ పచ్చని పొలాల్లో ఇథనాల్ మంట పెట్టొద్దని నిర్మల్ జిల్లా రైతులు నిరసనకు దిగారు. నిన్న పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నిరసన కాస్త మంగళవారం మరింత తీవ్ర రూపం దాల్చింది.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున తరలివచ్చి డిమాండ్ చేశారు. అంతకుముందే పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ప్రజలు సహనం కోల్పోయారు.
ఏకంగా బంద్ పాటించడంతోపాటు దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై వందలమంది నిరసనకారులు బైఠాయించారు. నిర్మల్-భైంసా మార్గంలో సుమారు 12 గంటలకు పైగా రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో హైవేపై గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం అక్కడే చలిమంటలు కూడా కాగారు. వారికి నచ్చజెప్పేందుకు ఆర్డీవో రత్నకల్యాణి వచ్చినప్పటికీ ఆమెను చుట్టుముట్టారు. దాంతో ఆమె రాత్రి వరకూ వాహనంలోనూ కూర్చుండిపోయారు. జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్ పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీవోను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఓ ఎస్సై గాయపడ్డారు. దాదాపు 300 మంది పోలీసులు మోహరించారు.
ఎట్టకేలకు బాధితుల ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చింది. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని కలెక్టర్ అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దిలావర్‌పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, రత్నపూర్‌కాండ్లి గ్రామస్తులతో కలెక్టర్ చర్చించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు. మొత్తానికి ఫ్యాక్టరీ పనులను నిలిపివేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.