సినిమాల్లో పవన్ ను ఫాలో అయినా.. రాజకీయాలు మాత్రం సపరేటు
ఆయన కెరీర్ ను చూస్తే.. ఆయన సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఎక్కువగా తెలుగు రీమేక్ లు కనిపిస్తాయి.
By: Tupaki Desk | 1 Feb 2024 2:30 PM GMTసినిమాల్లో పవన్ కల్యాణ్ ను ఫాలో అయ్యే తమిళ హీరో విజయ్.. రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్రను వేసేలా కసరత్తు చేస్తున్నారా? అంటే అవునని చెప్పాలి. ఆయన కెరీర్ ను చూస్తే.. ఆయన సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఎక్కువగా తెలుగు రీమేక్ లు కనిపిస్తాయి. కొంతకాలంగా ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ కావటం.. వసూళ్ల పరంగా సంత్రప్తికరంగా ఉండటం తెలిసిందే.
ఇటీవల ఆయన పారితోషికం పెరిగింది. ఒక సినిమాకు రూ.100కోట్లు తీసుకున్న ఆయన.. అదే సినిమా తెలుగు వెర్షన్ కు రూ.40కోట్లు కలుపుకొని మొత్తం రూ.140 కోట్లు తీసుకున్నట్లుగా చెబుతారు. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న నటుడిగా విజయ్ కు పేరుంది. ఆయన్ను అభిమానులు దళపతిగా పిలుచుకుంటారు.కెరీర్ మొదట్లోనే కన్నడ.. మలయాళ మార్కెట్లలో ఆయన సినిమాలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు తెలుగులోనూ ఆయన సినిమాకు క్రేజ్ పెరిగింది.
ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటున్న విజయ్.. మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు భారీగా సాగుతోంది. తాజాగా తమిళనాడులో విజయ్ ఆయన సతీమణి మీద వేసిన ఒక పోస్టర్ సంచలనంగా మారింది. విజయ్ ను ఎంజీఆర్ గా.. ఆయన సతీమణిని జయలలితగా పేర్కొంటూ ఒక పోస్టర్ ఇప్పుడు హడావుడి చేస్తోంది.
ఇప్పటికేపలు సేవాకార్యక్రమాల్లో ముందున్న విజయ్.. రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్ లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు.. జెండా.. ఎజెండాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు.
పార్టీ పేరు విషయంలో విజయ్ ఇప్పటికే తన ప్రాధాన్యతలను చెప్పేసినట్లుగా తెలుస్తోంది. పార్టీకి ప్రజలు.. తమిళనాడు.. డెవలప్ మెంట్.. పార్టీ లాంటి పదాలు ఉండేలా కసరత్తు చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. పార్టీ పేరు దగ్గర దగ్గరగా తమిళగ మున్నేట్ర కళగం ఉండొచ్చని అంటున్నారు. ఇదే పేరు తాజాగా ఎన్నికల సంఘంలో నమోదైన నేపథ్యంలో.. ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే.. పార్టీ పేరు విషయంలో విజయ్ కానీ ఆయన అభిమానులు కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటం తెలిసిందే.
గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయ్ అభిమానులు ఎన్నికల బరిలోకి దిగారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని చెప్పినా.. అదంత సులువు కాదంటున్నారు. ఒకవేళ.. దిగినా ఆయన మద్దతు ప్రకటించేలా ఉంటుందని భావిస్తున్నారు. మరో రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని బలంగా భావిస్తున్నట్లుగా చెప్పాలి. సినిమాల్లో పవన్ కల్యాణ్ ను ఎక్కువగా అనుకరించే విజయ్.. రాజకీయాల్లో మాత్రం తనదైన మార్కును చూపించాలని తపిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయన వేసే అడుగులు వ్యూహాత్మకంగా ఉండటం కనిపిస్తోంది.