Begin typing your search above and press return to search.

జంపింగ్ జపాంగ్.. మా ఎంపీ అభ్యర్థి ఫలానా.. అయితే ఏ పార్టీ?

అసెంబ్లీ సమరం ముగిసిన ఆరు నెలల్లోపే లోక సభ ఎన్నికలు ఉండడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   24 March 2024 2:30 PM GMT
జంపింగ్ జపాంగ్.. మా ఎంపీ అభ్యర్థి ఫలానా.. అయితే ఏ పార్టీ?
X

ఎన్నికలు అయిపోయాక పరాజయం ఎదుర్కొన్న పార్టీలో నిస్తేజం సహజం.. గెలిచిన పార్టీలో ఉత్సాహం ఇంకా సహజం.. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించిన పార్టీ అయితే కాస్త ఆశావహంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ సమరం ముగిసిన ఆరు నెలల్లోపే లోక సభ ఎన్నికలు ఉండడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

అటునుంచి ఇటు.. ఇటు నుంచి అటు

మొన్నటివరకు తెలంగాణలో రాజకీయం స్పష్టంగా ఉండేది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ. ఏ పార్టీలోని వారు ఆ పార్టీలో ఉండేవారు. కానీ, బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, దేశంలోనూ మోదీ ప్రభను నమ్ముకుని బీజేపీ దూకుడు మీద ఉండడంతో నాయకుల జంపింగ్ లు మొదలయ్యాయి. ఈ దూకుడు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత (బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్)తో మొదలైంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ సిటింగ్ ఎంపీ పి.రాములు అనూహ్యంగా బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఇలాగే చేశారు. వీరిలో పాటిల్ నేరుగా మళ్లీ బరిలో దిగారు. పి.రాములు కుమారుడికి టికెట్ దక్కింది. ఇక చేవెళ్ల్ నుంచి మొన్నటివరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రంజిత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ లో చేరారు. టికెట్ కూడా తెచ్చుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈయన కూడా సికింద్రాబాద్ టికెట్ తెచ్చుకున్నారు. అటు ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన జి.నగేశ్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. వరంగల్ లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆరూరి రమేశ్ కు ఇవ్వనుంది.

జంపింగ్ కన్ఫ్యూజన్

జంపింగ్ ల నేపథ్యంలో ఎవరు ఏపార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే కన్ఫ్యూజన్ ప్రజల్లో నెలకొంది. ఖమ్మంలో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన నాయకుడిని లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నల్లగొండ జిల్లాలోనూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చింది. భువనగిరి ఎంపీగా గతంలో బీఆర్ఎస్ లో ఉన్న బూర నర్సయ్య గౌడ్ కు అవకాశం కల్పించింది. ఇప్పుడు నల్లగొండలోనూ టికెట్ మార్పు ఖాయం అంటున్నారు. అది కూడా బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడికే కావడం గమనార్హం.