అక్కడ బీజేపీకి అన్నీ షాకులే.. బీఆర్ఎస్ కీలక నేత ఖుషీ!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కీలక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం చేనేతలకు పేరుగాంచింది.
By: Tupaki Desk | 31 Oct 2023 12:30 PM GMTస్థానిక నేపథ్యం కారణంగా.. తెలంగాణలో పేరున్న నియోజకవర్గం అది. అక్కడి కళాకారులు ప్రపంచ ఘనత వహించారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో అక్కడి నైపుణ్యం అక్కరకు రాకుండా పోయింది. దీంతోనే ఆకలి చావులు, వలసలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చాక మాత్రం కాస్త తెరిపిన పడుతోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కీలక నాయకుడు ఒకరు అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడమే.
ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కీలక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం చేనేతలకు పేరుగాంచింది. 2009లో ఇక్కడినుంచి అతి స్వల్ప ఓట్లతో గెలిచిన కేటీఆర్ ఆ తర్వాత తన పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించారు. అయితే, కేటీఆర్ మంత్రిగా సిరిసిల్లకు అధిక నిధులు కేటాయించారు. బతుకమ్మ చీరలను సిరిసిల్ల నేతన్నలతో నేయించి వారికి బతుకుదెరువు చూపారు. మరోవైపు కేటీఆర్ వివిధ ప్రగతిదాయక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా సిరిసిల్లకు తాను ఉన్నాననే భరోసా కల్పించారు. సిరిసిల్ల వంటి చోట పాతుకుపోయిన కేటీఆర్ ను ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ వేసిన ఎత్తుగడ పారకపోగా, ఆ పార్టీకి మరింత షాక్ ఇస్తున్నది.
స్థానికేతరులకు టికెట్ తో..
సిరిసిల్ల వంటి చోట స్థానికులకు టికెట్ ఇస్తేనే కేటీఆర్ తో పోటీ కష్టంగా ఉంటుంది. అలాంటిది బీజేపీ స్థానికేతరురాలైన రాణి రుద్రమను అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి ఇక్కడ బీజేపీకి కేడర్ బలం ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు కూడా వచ్చాయి. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థికి కేవలం 2 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. మునిసిపల్ ఎన్నికలు సహా ఆ తర్వాత కూడా పార్టీ బలపడింది. సెస్ ఎన్నికల్లో మంచి ఓట్లను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని నేతలు భావించారు. ఇదేమీ పట్టించుకోకుండా స్థానికేతరురాలికి టికెట్ ఇవ్వడం ఏమిటని స్థానిక బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉన్నవారు కూడా రాజీనామా సమర్పిస్తున్నారు. ముఖ్య నేతలందరూ పార్టీ వీడుతున్నారు. టికెట్ ఆశించిన.. లగిశెట్టి శ్రీనివాస్. రమకాంత్, అన్నలదాసు వేణు గుడ్‌బై చెప్పారు. రమాకాంత్ అయితే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇతర నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకరం ఏమంటే.. కేడర్ కూడా సామూహికంగా రాజీనామా చేస్తున్నారు.
అధిష్ఠానం నిమిత్తమాత్రం
ఎన్నికలు సరిగ్గా నెల రోజులు కూడా లేని నేపథ్యంలో సిరిసిల్లలో ఇంత జరుగుతున్నప్పటికీ, అసంతృప్తులు మండిపడుతున్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే కేసులు పెట్టారని, ఇప్పుడు కొత్త వారికి టికెట్ ఎలా ఇస్తారని అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్న నేతలు సైతం ప్రచారంలో కలిసిరావడం లేదు. ముఖ్య నేతలకు ఇది ఇబ్బందిగా మారింది. కొందరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పడంతో మిన్నకున్నారు.
అన్నీ సర్దుకుంటాయి..
సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మాత్రం పార్టీలో ఉన్న చిన్న, చిన్న పొరపాట్లను త్వరలో సరిదిద్దుకుంటామని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. చూడాలని ఎన్నికల నాటికి అసంతృప్తులు ఏం చేస్తారో చూడాలి. కాగా, రాణిరుద్రమ తన సొంత పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె అభ్యర్థిత్వంపై కేడర్ నుంచి నిరసనలు వస్తుండడంతో కేటీఆర్ కు పోటీనే లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.