Begin typing your search above and press return to search.

జైలుకు వెళ్లొచ్చిన మాజీ సీఎంల కుమార్తెలు ఎవరెవరో తెలుసా..?

ఇలా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 4:11 AM GMT
జైలుకు వెళ్లొచ్చిన మాజీ సీఎంల కుమార్తెలు ఎవరెవరో తెలుసా..?
X

రాజకీయాలనూ, కేసులనూ విడదీసి చూడలేమని... రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసులు సహజమని కొందరు అంటే... కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రాజకీయాలు అవసరమని, పార్టీల మార్పు అనివార్యమని అనేవారు మరికొందరు. ఏది ఏమైనా... రాజకీయ నాయకులపై పలు కేసులు నమోదవ్వడం అత్యంత సహజమైపోయిన రోజులివి!

అయితే ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలూ చేస్తూ నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు పెట్టే కేసులకు.. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులకూ చాలా వ్యత్యాసం ఉంటుందనేది మాత్రం సుస్పష్టమైన అంశం. ఆ సంగతి అలా ఉంటే... కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే!

ఇలా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు. తాను తెలంగాణ బిడ్డను అని, కేసీఆర్ కూతురుని అని చెబుతూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని తెలిపారు. గతంలో తాను మొండిగా ఉండేదానినని.. ఇప్పుడు తనను జగమొండిగా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు.

ఆ సంగతి అలా ఉంటే... కవితతో పాటు మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు కూడా గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలుసా..? అందులో ఒకరు ఏకంగా అండమాన్ జైల్లో ఉన్న సంగతి తెలుసా..? అనూహ్యంగా ఆ ఇద్దరూ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ గా ఎన్నికయ్యారనే విషయం తెలుసా..? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...!

అవును... బీఆరెస్స్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కుమార్తె కవిత 5 నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపి తాజాగా సుప్రీంకోర్ట్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూప్ తో చేతులు కలిపి.. రూ.100 కోట్ల మేర ఆప్ నాయకులకు అందించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు!

అయితే... కవితతో పాటు గతంలో మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైలు జీవితం గడిపినవారే. వీరిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమర్తె కనిమొళి.. ఒకరు కాగా... బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ఇంకొకరు. వీరు ఏయే కేసుల్లో ఎన్నెన్ని రోజులు జైల్లో ఉన్నరనేది ఇప్పుడు చూద్దాం...!

తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి 2007-2010 మధ్య ఏకంగా అండమాన్ జైల్లో ఉంచబడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన "2జీ" స్పెక్ట్రం కుంభకోణం కేసే ఇందుకు కారణం. అప్పట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న డీఎంకే ఎంపీ రాజాతో ఈమె చేతులు కలిపారని.. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ.

ఆ కేసులో సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నారు కనిమొళి. తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. అయితే... కనిమొళి జైల్లో ఉన్న సమయంలో కరుణానిధి కాస్త దిగి వచ్చి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చిందని చెబుతుంటారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు.

ఇక బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి కూడా జైలు జీవితం అనుభవించిన సీఎంల కుమార్తెల జాబితాలో ఉన్నారు. గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత.. ఆయన సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కుంభకోణం వెలుగు చూసింది!

ఈ కేసులో మీసా భారతి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. అయితే ఆమె కేవలం 5 రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు.