బాబు ఎంతటి భయస్తుడో చెప్పిన కేంద్ర మాజీ మంత్రి!
తాజాగా చంద్రబాబు ఎలాంటి నేత? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న విషయాలకు సంబంధించి రివీల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
By: Tupaki Desk | 24 Sep 2023 4:43 AM GMTచింతా మోహన్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగిన వేళలోనే కాదు.. ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలోనూ తిరుపతి ఎంపీగా చింతా మోహన్ తన సత్తా చాటుతూనే ఉండేవారు. ఆయనకున్న బలం ఎంతన్న విషయం ఎన్నికల ఫలితాలు తరచూ స్పష్టం చేస్తూ ఉండేవి. దీనికితోడు టీడీపీ అధినేతగా చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన చింతా మోహన్.. ఆయనతో సుదీర్ఘకాలంగా సరైన సంబంధాలు లేని వ్యక్తిగా చింతా మోహన్ ను చెబుతారు.
అలాంటి ఆయన.. తాజాగా చంద్రబాబు ఎలాంటి నేత? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న విషయాలకు సంబంధించి రివీల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 49 ఏళ్లుగా చంద్రబాబు తనకు తెలుసని.. ఆయన చాలా భయస్తుడని.. సొంత తమ్ముడికి మేలు చేసినా జనాలు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో సాయం చేయకుండా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. తాజాగా స్కిల్ స్కాం ఎపిసోడ్ నేపథ్యంలో చింతా మోహన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. చంద్రబాబుపై వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆయనకే అనుకూలంగా మారుతుందన్నారు. చంద్రబాబు.. వైఎస్ లు ఎంతో కలిసి మెలిసి ఉండేవారని.. అనుభవం లేకపోవటం వల్లే జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. వ్యక్తిగత కక్షతో కూడుకున్న రాజకీయాలు ఏ మాత్రం మంచివి కావన్న ఆయన.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబు తప్పుచేసే వ్యక్తి కాదన్న చింతా.. ఆయన అరెస్టును తప్పు పట్టారు.
చంద్రబాబు చాలా కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన నాయకుడని.. ఆయన అరెస్టు వెనుక కొందరు పెద్దల హస్తం ఉందన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగటం ఖాయమంటున్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.17 వేల కోట్ల టీటీడీ బంగారం నిల్వలు ఎక్కడకు వెళ్లాయో టీటీడీ అధికారులు చెప్పాలన్న చింతా మోహన్.. రూ.17 వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామని టీటీడీ చెబుతున్నప్పుడు.. ఎవరికి ఇచ్చారో చెప్పాలంటే మాత్రం ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు.