Begin typing your search above and press return to search.

మోడీ 3.0: అంతమంది మాజీ సీఎంలకు కేబినెట్ కొలువులు!

కొలువు తీరిన మోడీ ప్రభుత్వంలో ఆసక్తికర అంశం ఉంది. తాజా కేబినెట్ లో మాజీ ముఖ్యమంత్రులు పలువురు కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:30 AM GMT
మోడీ 3.0: అంతమంది మాజీ సీఎంలకు కేబినెట్ కొలువులు!
X

అంచనాలకు తగ్గట్లే మోడీ 3.0 ప్రభుత్వం కొలువు తీరింది. ఆదివారం రాత్రి 7.15 గంటల వేళలో రాష్ట్రపతి భవన్ లో దాదాపు 8వేల మందికి పైగా విదేవీ.. స్వదేశీ అతిధుల సమక్షాన నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తంగా మోడీ 3.0 ప్రమాణస్వీకార కార్యక్రమం దాదాపు పదిన్నర గంటల వరకు సాగింది.

కొలువు తీరిన మోడీ ప్రభుత్వంలో ఆసక్తికర అంశం ఉంది. తాజా కేబినెట్ లో మాజీ ముఖ్యమంత్రులు పలువురు కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టారు. నరేంద్ర మోడీ సైతం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే ఆయనకు ప్రధానమంత్రిగా అవకాశం రావటం తెలిసిందే. ఓవైపు గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తూ 2014 ఎన్నికల్లో ఎంపీగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన.. రెండు చోట్ల ఘన విజయాన్నిసాధించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కట్ చేస్తే.. తాజాగా కొలువు తీరిన మోడీ కేబినెట్ లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం కేబినెట్ లో 30 మంది కేంద్ర మంత్రులు.. మిగిలిన వారిలో డిప్యూటీ మంత్రులు.. సహాయ మంత్రులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల్లో కొందరు పలుమార్లు సీఎంలుగా వ్యవహరించిన వారు తాజా మోడీ కేబినెట్ లో ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్ నాధ్ సింగ్.. అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తో పాటు ఎన్డీయే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పార్టీలకు చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సైతం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన హెడి కుమారస్వామి ఉండగా.. మరొకరు బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జితిన్ రామ్ మాంఝీ. ఇంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఒక కేబినెట్ లో ఉండటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.