ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఈసీ బ్యాన్.. 30 వరకు అంతే!
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎవరూ ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
By: Tupaki Desk | 27 Nov 2023 4:02 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు మెజారిటీ దక్కించుకుంటారు? ఎవరు ఓడతారు? అసలు ఏం జరుగుతుంది? ప్రజానాడి ఎలా ఉంది? అనే అంశాలు ఆసక్తికరమే. అయితే.. ఇప్పటి వరకు ఏం జరిగినా.. ఇక నుంచి ఆయా వివరాలపై సర్వే ఫలితాలు వెల్లడించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీలు, సోషల్ మీడియా, పత్రికలు సహా ఏ ప్రసార మాధ్యమాల్లోనూ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎవరూ ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని క్లాజ్ 126(ఏ) ప్రకారం.. ఈ నిబంధనను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు, వైరల్ చేసేందుకు.. ఈ చట్టం అనుమతించబోదని పేర్కొంది.
ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే అన్ని అంశాలను.. నిషేధిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా, సక్రమంగా.. ఎలాంటి ప్రలోభాలు లేకుండా నిర్వహించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇదిలావుంటే.. తెలంగాణలో ఇప్పటి వరకు అనేక సర్వేలు వచ్చాయి. అధికార బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని.. సర్వేలు వెల్లడించినా.. ఏ పార్టీకీ పూర్తీస్థాయిలో అధికారం కట్టబెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల ప్రచారం మరింత తీవ్రతరం కానుంది. ఈ క్రమంలోనే సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం గమనార్హం.