అటూ ఇటూ తిరిగి వైసీపీలోకి మాజీ మంత్రి.. ఆ సీటు ఇస్తారా..!
గుంటూరులో ఆయన ప్రత్యేక బస ఏర్పాటు చేసుకుని.. తనకంటూ ఓవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2024 2:30 AM GMTరావెల కిశోర్‌బాబు గుర్తున్నాడా? గతంలో టీడీపీ హయాంలో 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఎస్సీ నాయకుడు. అప్పట్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని.. రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీరావడంతోనే టీడీపీలో చేరి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. మంత్రిగా కూడా ఆయన ఛాన్స్ పొందారు. గుంటూరులో ఆయన ప్రత్యేక బస ఏర్పాటు చేసుకుని.. తనకంటూ ఓవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అయితే.. ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడం.. కుమారులపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. దీంతో అలిగి ఆయన పార్టీ నుంచి దూరమై.. జనసేన, బీజేపీలతో జట్టుకట్టారు. 2019లో జనసేన తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత.. మళ్లీ జనసేనకు దూరమై.. బీజేపీతో చేతులు కలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించి భంగపడి మళ్లీ బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్‌లో చేరిపోయారు. బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడిగా ప్రస్తుతం ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ పార్టీ తెలంగాణకే పరిమితం కానుందని నిర్ణయించారు. త్వరలోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాకుండా.. తెలంగాణలోనే పోటీ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ రెండు రోజుల కిందట నిర్ణయించారు. దీంతో రావెల ఈ పార్టీ నుంచిబయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన చూపు వైసీపీపై పడింది.
వైసీపీ కూడా.. ఎస్సీ సామాజిక వర్గంలో అంతో ఇంతో ఇమేజ్ సంపాయించుకున్న ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో రావెలకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయనను చేర్చుకునేందుకురెడీ అయిందని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రత్తిపాడు సీటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతంమాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను ఇప్పటికే తాడికొండకు పంపించారు.
ఈ ప్లేస్‌లో కిరణ్‌కుమార్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. మాదిగ వర్గం ఎక్కువగా ఉన్న చోట మాల నేతలకు టికెట్ ఇవ్వడంపై స్థానికంగా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రావెల ఎంట్రీ ఇస్తుడడం.. నియోజకవర్గంలో పరిస్తితి బాగోలేదని గుర్తించడంతో ఆయనకు ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశం మెండుగా ఉందనే చర్చ సాగుతోంది.