వైసీపీ ట్యాగ్ వదిలేసిన మాజీ మంత్రి....?
ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. పలు మార్లు మంత్రిగా పనిచేశారు.
By: Tupaki Desk | 24 Sep 2023 3:45 AM GMTఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. పలు మార్లు మంత్రిగా పనిచేశారు. అలాంటి ఆయన టీడీపీ నుంచి బయటపడి వైసీపీ మళ్లీ టీడీపీ మళ్లీ వైసీపీ ఇలా తిరిగేసరికి రాజకీయం కాస్తా తిరగబడింది. ఆయనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.
ఆయన వారసుడికి 2024లో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించినట్లుగా లేవు. ఇక వైసీపీ దాదాపుగా అయిదేళ్ల పాలనకు చేరువ అవుతున్నా ఆయనకు ఎమ్మెల్సీ లాంటి నామినేటెడ్ పదవి కూడా దక్కలేదన్న బాధ ఉంది. ఇవన్నీ కలసి ఆయన వైసీపీకి దూరం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కుమారుడు రత్నాకర్ మాత్రం ఇంకా వైసీపీలో తిరుగుతున్నారు. దాడి ఏడు పదుల వయసు పై దాటారు. ఆయన ఇపుడు కొంత న్యూట్రల్ గా ఉంటున్నారు. ఎన్నికల వేళకు ఏ వైపు మళ్ళుతారో తెలియదు కానీ ఇప్పటికి అయితే మాత్రం ఆయన మాజీ మంత్రిగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన బాబు స్కిల్ స్కాం లో రిమాండ్ కి వెళ్ళినా కనీసంగా స్పందించడంలేదు అని వైసీపీలోనే చర్చ సాగుతోంది
దాంతో ఆయన వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడితో కలసి టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అన్న చర్చ అయితే ఉంది. అందుకే ఆయన బయటపడి టీడీపీని ఏమీ అనడంలేదు అంటున్నారు. ఇక చాలా కాలానికి మీడియా ముందుకు వచ్చిన ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వల్ల ఇపుడు ఉపయోగం ఏమిటి అని నిలదీశారు.
ఆ బిల్లుని 2029 నాటికి అమలు చేయాలనుకుంటే ఇపుడు ఎందుకు చట్టం చేశారని కూడా ప్రశ్నించారు. మరో వైపు ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జగన్ కి కూడా లేఖ రాసినట్లుగా ఆయన మీడియాకు చెప్పారు. అంటే ఆయన వైసీపీ అధినాయకత్వానికి ఇక లేఖల ద్వారానే తన భావాలను అభిప్రాయాలను చెప్పి ప్రజల తరఫున సమస్యలతో ముందుకు రావాలని చూస్తున్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే దాడి తాను వైసీపీ నేతగా చెప్పుకోవడంలేదు, మాజీ మంత్రిగానే మీడియాలో రాయించుకుంటున్నారు. దీన్ని చూసిన వారు మాజీ మంత్రి వైసీపీ ట్యాగ్ ని వదిలేసినట్లేనా అని చర్చించుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా ఎడం పాటిస్తున్నారు అని అంటున్నారు.
రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేనల వైపు ఆయన మొగ్గు చూపుతారని కూడా అంటున్నారు. ఏది ఏమైన మాజీ మంత్రి మాజీ వైసీపీ నేతగా మారే రోజు దగ్గరలోనే ఉంది అన్న గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయనకు అనకాపల్లిలో యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి పడకపోవడం కూడా పార్టీకి దూరం జరగడానికి కారణం అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.