ఈ మాజీ మంత్రులకు ఈసారికి సారీయేనా?
అవును... పొత్తులో భాగంగా 144 శాసన సభ, 17 లోక్ సభ స్థానాలలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 6:42 AM GMTటీడీపీ మూడో జాబితా విడుదలైపోయింది. రెండో జాబితాలో తెరపైకి వచ్చిన కొన్ని సమస్యలకు, సందేహాలకూ ఈ మూడో జాబితా సమాధానాలు చెప్పింది. అయితే.. మరికొన్ని సందేహాలను మాత్రమే అలాగే ఉంచింది. ఈ సమయంలో ప్రధానంగా పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రుల పేర్లు మూడో జాబితాలో కూడా లేకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో వారికి ఈసారికి సారీయేనా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
అవును... పొత్తులో భాగంగా 144 శాసన సభ, 17 లోక్ సభ స్థానాలలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దీంతో తొలివిడతలో భాగంగా 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు... రెండో విడతలో భాగంగా 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ రెండు విడతల్లోనూ లోక్ సభ అభ్యర్థుల ప్రస్థావన తేలేదు. దీంతో... బీజేపీతో స్థానాల ఎంపికలో క్లారిటీ లేకపోవడమే దీనికి కారణం అని కథనాలొచ్చాయి.
దీంతో... తాజాగా 11 అసెంబ్లీ స్థానాలతోపాటు 13 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశారు చంద్రబాబు. దీంతో పోటీచేసే 144 స్థానాల్లోనూ 139 అసెంబ్లీ స్థానాలకు, 17లోనూ 13 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసినట్లయ్యింది. ఇక మిగిలింది 5 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం మాత్రమే! ఈ సమయంలో పలువురు సీనియర్లు, మాజీ మంత్రుల అభ్యర్థిత్వాలపై సందేహాలు తెరపైకి వచ్చాయి.
తాజాగా మూడో జాబితా కూడా ప్రకటించేయడం.. ఇక కేవలం 5 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటంతో... సీనియర్ నేతలు, పలువురు మాజీ మంత్రులకు ఈ సారి టిక్కెట్లు దక్కే అవకాశం లేదనే విషయం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయినట్లే అని అంటున్నారు. దీంతో.. ఆ సీనియర్ల లిస్ట్ తెరపైకి రావడంతోపాటు.. వారిలో ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఏపీ టీడీపీ మాజీ చీఫ్ కళా వెంకట్రావు, దేవినేని ఉమ, బండారు సత్యనారాయణ, కేఎస్ జవహార్ ల పేర్లు జాబితాలో కనిపించలేదు. దీంతో... ఇక వీరికి నో ఆప్షన్ అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో చీపురుపల్లి అంటూ బంతి ఆయన కోర్టులోనే వేసేసి వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు!
చీపురుపల్లిలో గంటా పోటీ విషయంపై క్లారిటీ వస్తే తప్ప... అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటుపైనా స్పష్టత వచ్చే అవకాశం లేదు! మరోవైపు పెనమలూరులో బోడె ప్రసాద్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ ల పేర్లు ఫైనల్ అయ్యాయి. దీంతో... ఇకపై బోడె ప్రసాద్ కాస్త కూల్ అయ్యి ప్రచారంపై దృష్టిపెడతారని తెలుస్తుంది! ఇదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ వర్గానికి కూడా డౌట్ క్లియర్ అయినట్లయ్యింది!
మరోపక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వనమాడి వెంకటేశ్వర రావు, కోళ్ల లలిత కుమారి వంటి సీనియర్లు టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం. కాగా... 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి వరుసగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయనకు మరోసారి చంద్రబాబు అదే స్థానం నుంచి అవకాశం ఇచ్చారు!