పవర్ పోయినా ద్వారంపూడి హవా తగ్గలేదుగా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలోనూ నడుస్తోందన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామం స్పష్టం చేసిందని చెప్పాలి.
By: Tupaki Desk | 3 July 2024 4:51 AM GMTప్రభుత్వం మారినా.. పవర్ చేజారినా కొందరు నేతల హవా నడుస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీన్ కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలోనూ నడుస్తోందన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామం స్పష్టం చేసిందని చెప్పాలి. ఆయన చేస్తున్న పని నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఆయన్ను ఆపటం పోలీసులకు కష్టతరం కావటం గమనార్హం.
జగన్ ప్రభుత్వంలో ద్వారంపూడి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఆయన తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించటం.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆటలు సాగవన్న విషయాన్ని అప్పట్లోనే స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కూటమి సర్కారులోనూ ద్వారంపూడి తన హవాను ప్రదర్శించటం హాట్ టాపిక్ గా మారింది.
కాకినాడ పట్టణ పరిధిలోని వైసీపీ నేతకు చెందిన అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతకు సంబంధించిన నోటీసులు జారీ చేయటం లాంటివి చేశారు. అయినప్పటికీ సంబంధిత నేత పట్టించుకున్నది లేదు.
దీంతో.. అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ద్వారంపూడి, ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగుల్ని అడ్డుకున్నారు. ఇటుకలతో దాడి చేయటంతో.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న సిబ్బంది పరుగులు తీయాల్సి వచ్చింది.
పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దెబ్బకు వారు ప్రేక్షక పాత్రను పోషించినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైతే ఇటుకలతో దాడి చేయటం మొదలు పెట్టారో అప్పుడు మేల్కొన పోలీసులు రియాక్టు అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ఉద్రిక్త పరిస్థితుల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు నానా తిప్పలు పడ్డారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అక్కడి నుంచి పంపిన తర్వాత ఉద్రిక్త వాతావరణం తొలిగింది. పవర్ పోయినా ద్వారంపూడి హవా కొనసాగుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.