Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే బీజేపీలో ఉండలేకపోతున్నారా...!?

అయితే పొత్తులు ఉంటే కచ్చితంగా తాను గెలుస్తాను అని రాజు ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీ ఎటూ తేల్చడంలేదు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 11:22 AM GMT
మాజీ ఎమ్మెల్యే బీజేపీలో ఉండలేకపోతున్నారా...!?
X

బీజేపీ పెద్దలు ఏపీలో రాజకీయ వ్యూహం ఏ విధంగా రూపొందిస్తున్నారో తెలియడంలేదు. పొత్తులు కనుక లేకపోతే చాలా మంది బీజేపీ గీత దాటేస్తారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. 2014లో విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గెలిచిన విష్ణు కుమార్ రాజు ఇపుడు మళ్లీ పొటీకి సిద్ధంగా ఉన్నారు

అయితే పొత్తులు ఉంటే కచ్చితంగా తాను గెలుస్తాను అని రాజు ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీ ఎటూ తేల్చడంలేదు. దీంతో ఆయన తెగ టెన్షన్ పడుతున్నట్లుగా ఉంది. ఆయన తడవకోసారి మీడియా ముందుకు వచ్చి ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకోవాలని సూచిస్తూ వస్తున్నారు.

కొత్త ఏడాది కూడా ఆయన మనసు ఆపుకోలేక అదే మాట అంటున్నారు. నిజానికి బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. పార్టీయే డిసైడ్ చేస్తుంది. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి లాంటి వారు సైతం పార్టీ నిర్ణయమే అని చెబుతున్నారు తప్ప సూచించడం లేదు.

అయితే మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అనేక సార్లుగా చెబుతూ వస్తున్నారు. నిజానికి బీజేపీ అధినాయకత్వానికి ఏపీలో ఏమి చేయాలో బాగా తెలుసు అని అంటున్నారు.

కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలకు ఏపీలో ఎలా వెళ్తే పార్టీకి రాజకీయ లాభమో చూసుకుంటారు కదా అని అంటున్నారు. ఇక ఏపీ వరకు మాత్రమే కేంద్ర నాయకత్వం ఆలోచనలు ఉండవని జాతీయ స్థాయిలో పరిణామాలను కూడా చూసుకుని నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

కానీ విష్ణు కుమార్ రాజు లాంటి వారు మాత్రం పొత్తు పెట్టుకోవాల్సిందే అని చెప్పడమే ఆ పార్టీలో మిగిలిన నేతలు కూడా విస్మయపరచేలా ఉంది అని అంటున్నారు. బీజేపీ ఏపీలో ఎపుడూ పొత్తు పార్టీగానే ఉండాలా అన్నది కేంద్ర పార్టీ భావన. అయిదేళ్ల పాటు ఉద్యమాలు చేసుకుని ఉంటే సొంతంగా పార్టీ పోటీ చేసే స్థితికి వచ్చేదని అంటున్నారు.

అలా కాకుండా ఎన్నికల టైం కి వచ్చేసరికి మాత్రం పొత్తులతో పోదామని చెబుతూ నాయకులే ఇలా చేస్తూంటే పార్టీ ఎపుడు ఎదుగుతుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీ వైసీపీ రెండింటితోనూ సమాన దూరాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు భావించాలనుకుంటే పొత్తులకు దూరంగానే జరుగుతారు అని అంటున్నారు

ఇక విష్ణుకుమార్ రాజు కొత్త ఏడాది మొదటి రోజునే జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. చెత్త ముఖ్యమంత్రి అంటూ పరుషంగా మాట్లాడడం కూడా చర్చకు తావిస్తోంది. బీజేపీలో అంతా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటారు. అదే విధంగా విధానపరంగానే మాట్లాడుతారు. మరి విష్ణు కుమార్ రాజు ధోరణి చూస్తూంటే ఆయన ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు అని కూడా చర్చకు వస్తోంది.

రేపటి రోజున బీజేపీ పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిన వారే పార్టీలో కొనసాగుతారని అంటున్నారు. బీజేపీకి అధికారం ముఖ్యమే కానీ దానికి కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజుగారికి ఇవన్నీ తెలియదా అంటే ఆయన పొత్తుల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలనే అంటున్నారు.