Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో చేరికల వెల్లువ.. మరో మాజీ మహిళా ఎమ్మెల్యే సిద్ధం!

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రెట్టించిన ఉత్సాహంతో సీనియర్‌ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతుండటంతో ఆ పార్టీలో సమరోత్సాహం నెలకొంది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 1:13 PM GMT
కాంగ్రెస్‌ లో చేరికల వెల్లువ.. మరో మాజీ మహిళా ఎమ్మెల్యే సిద్ధం!
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఇక్కడ కూడా అదే మ్యాజిక్కును రిపీట్‌ చేయాలనే ఆలోచనలో ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రెట్టించిన ఉత్సాహంతో సీనియర్‌ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతుండటంతో ఆ పార్టీలో సమరోత్సాహం నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కూడా కాంగ్రెస్‌ లో చేరారు. మరికొద్ది రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంటున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీలో చేరతారని చెబుతున్నారు.

మరోవైపు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టీడీపీ తరపున పలుమార్లు కొత్తకోట దయాకరరెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకరరెడ్డి విజయం సాధించారు. 2009లో ఏకకాలంలో భార్యభర్తలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్న అరుదైన రికార్డును కూడా వారు దక్కించుకున్నారు. మక్తల్‌ నుంచి కొత్తకోట దయాకర్‌ రెడ్డి, దేవరకద్ర నుంచి సీతా దయాకర్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో ఇటీవల కొత్తకోట దయాకరరెడ్డి కన్నుమూశారు.

2001లో జెడ్పీటీసీగా సీతా దయాకరరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అదే సంవత్సరం మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

కాగా సీతా దయాకరరెడ్డి భర్త కొత్తకోట దయాకరరెడ్డి 1994, 1999ల్లో అమరచింత నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలుపొందారు. 2009లో మక్తల్‌ నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఏడాది జూన్‌ లో ఆయన క్యాన్సర్‌ తో కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ లో చేరికకు కొత్తకోట దయాకరరెడ్డి సతీమణి సీతా దయాకరరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్‌ రెడ్డి నివాసానికి వచ్చారు. ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ లో చేరికకు సీతా దయాకరరెడ్డి ఆసక్తి చూపారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

కాగా సీతాదయాకరరెడ్డి చేరికతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మహబూబ్‌ నగర్‌ లో గట్టి పట్టు దొరికినట్లు అయింది. అందులోనూ 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ లో సీతా దయాకరరెడ్డి చేరిక కాంగ్రెస్‌ కు మరింత బూస్ట్‌ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. మహిళల కోణంలోనూ పార్టీ బలోపేతమవుతుందని అంటున్నారు.