విస్తరణకు బ్రేక్ వేసింది నల్లగొండేనా ?!
ఈ విస్తరణ వాయిదా పడడానికి ప్రధాన కారణం నల్లగొండ జిల్లా నేతలే అని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 10 July 2024 5:45 AM GMTకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ నెల 7 తో ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల నడుస్తుంది. డిసెంబరు 7న 12 మంది మంత్రులతో సహా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. కాస్త విరమణ తర్వాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఈ లోపు లోక్ సభ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన వారికి మంత్రి పదవులు అని ఊహాగానాలు చెలరేగాయి.
ఎన్నికల ప్రచారంలో పలువురికి మంత్రి పదవులు ఇస్తామని సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఎన్నికల ఫలితాల అనంతరం ఐదు రోజులు ఒకసారి, ఆ తర్వాత రెండు సార్లు రేవంత్ మంత్రి వర్గ విస్తరణ కోసం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపాడు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో మకాం వేసి కొత్త మంత్రుల జాబితాను అధిష్టానం ముందుపెట్టారు. కానీ ఇప్పటి వరకు అసలు కొత్తగా మంత్రివర్గ విషయం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఈ విస్తరణ వాయిదా పడడానికి ప్రధాన కారణం నల్లగొండ జిల్లా నేతలే అని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. అయినా భువనగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిపదవి ఇస్తామన్న సంకేతాలు రేవంత్ కూడా ఇచ్చాడు. అయితే పార్టీలు మారిన వారికి, అందులో ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తన కుటుంబంలో తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం.
ఏడేళ్లు పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఇచ్చిన ప్రతి పనిని చేశానని, తమ కుటుంబం పార్టీకి విధేయంగా పనిచేసిందని, నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిని అయిదు లక్షల పై చిలుకు ఓట్లతో రికార్డ్ మెజారిటీతో గెలిపించామని, కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన భార్యకు పదవి ఇవ్వాలని ఉత్తమ్ వాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఉన్న ఆరు మంత్రి పదవులలో ఇద్దరు రెడ్లు నల్లగొండ నుండి పోటీ పడుతుండగా, ఇదే జిల్లా నుండి ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ పదవిని ఆశిస్తుండడం గమనార్హం. ఇక నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. ముగ్గురు రెడ్లకు ఇస్తే కురుమ, లంబాడా, ముదిరాజ్, మాదిగ, మైనారిటీ సామాజిక వర్గాలు అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి వర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పదవి భర్తీని వాయిదా వేయడం విశేషం. ఇన్ని చిక్కుముడులు విప్పి అధిష్టానం ఎప్పుడు మంత్రి పదవులు భర్తీ చేస్తుందో అని ఆశావాహులు దీనంగా ఎదురుచూస్తున్నారు.