Begin typing your search above and press return to search.

హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారికి మహర్దశ.. 6 లైన్లకు విస్తరణ

హైదరాబాద్ – విజయవాడ నగరాలను కలిపే 181 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిని నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని 2007 తర్వాత సంకల్పించారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 11:30 AM GMT
హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారికి మహర్దశ.. 6 లైన్లకు విస్తరణ
X

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రహదారి ఏది..? లేదా ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉన్న రహదారి ఏది..? రెండు ప్రధాన నగరాల మధ్యన ఉన్న కీలక రహదారి ఏది..? సరుకు రవాణాకు కీలకంగా ఉన్న రహదారి ఏది..? వీటన్నిటికీ తడుముకోకుండా వచ్చే జవాబు హైదరాబాద్-విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి. సరిగ్గా 20 ఏళ్ల కిందట నాలుగు లైన్లు కూడా లేదు ఈ రహదారి. అలాంటిదానిని 2003-04 మధ్యన విస్తరణ మొదలుపెట్టారు. ఓ రెండేళ్లకు అటు ఇటుగా పనులు పూర్తయ్యాయి. ఈ లోగా మళ్లీ రద్దీ పెరిగింది. మళ్లీ విస్తరణ అవసరమైంది.

హైదరాబాద్ – విజయవాడ నగరాలను కలిపే 181 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిని నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని 2007 తర్వాత సంకల్పించారు. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి- 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసల నుంచి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు. 2007 ప్రారంభంలో, భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ విజయవాడ-హైదరాబాద్ సెక్షనును నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. 2010లో అంచనా వ్యయం 1,470 కోట్లు అని పేర్కొన్నారు. రెండేళ్లకు పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ఈ ఎక్స్‌ ప్రెస్ వే తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (విజయవాడ) లను కలిపే ప్రధాన రహదారిగా, వివిధ వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా మారింది.

ప్రమాదాలు అధికమే..

హైదరాబాద్-విజయవాడ రహదారిపై ప్రమాదాలు అధికమే. రద్దీ కారణంగానే దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహా నటుడు, ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన నందమూరి తారక రామారావు కుమారుడు హరిక్రిష్ణ, మనవడు జానకి రాం ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతలు లాల్ జాన్ బాషా, ఎర్రన్నాయుడు సహా ఇంకా ఇలాంటి ఎందరో చనిపోయారు. అలాంటి రహదారిపై ఫోకస్ పెడతానని చెబుతున్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదివారం సెక్రటేరియట్ లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 9 ఫైళ్లపై సంతకాలు చేశారు. రహదారుల నిర్వహణకే తమ తొలి ప్రాధాన్యం అని.. తెలంగాణలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరతానని వివరించారు.

ఆరు వరుసలుగా విజయవాడ హైవే

హైదరాబాద్ – విజయవాడ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునేలా చూస్తానని చెప్పారు. కాగా, ప్రస్తుతం 181 కిలోమీటర్ల మేర ప్రయాణానికి నాలుగున్నర నుంచి ఐదు గంటలు పడుతోంది. అది కూడా నాలుగు వరుసలు ఉండడంతో ట్రాఫిక్ సమయంలో ఇబ్బంది కలుగుతోంది. ఆరు వరసలుగా విస్తరిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుంది.