Begin typing your search above and press return to search.

రెండు బీఎండబ్ల్యులు, ఒక ఇన్నోవాపై పవన్ ఆరా... మేటర్ ఏమిటంటే..?

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ నివేదిక కోరారు!

By:  Tupaki Desk   |   21 Nov 2024 5:45 AM GMT
రెండు బీఎండబ్ల్యులు, ఒక ఇన్నోవాపై పవన్  ఆరా... మేటర్  ఏమిటంటే..?
X

అటవీ శాఖలో ఖరీదైన కార్లు కనిపించకుండా పోయాయనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన కార్లను ముఖ్యమైన అధికారులకు కేటాయించగా.. అవి వారితోపాటే వెళ్లిపోయాయా? ఆసలు ఏమయ్యాయి? అనే చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ నివేదిక కోరారు!

అవును... అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 404/2017 సంబంధించిన కేసులో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బీహెచ్ 3303 నెంబర్ కలిగిన బీఎండబ్ల్యూ కారు ఏమైందనేది ఇప్పుడు అటవీశాఖలో పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు. దీంతో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై నివేదిక కోరారు!

ఇదే సమయంలో... పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎస్ 18 కే 2277 అనే నంబర్ గల బీఎండబ్ల్యూ కారుతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 07 సీబీ 3724 టయోటా ఇన్నోవా వాహనం అక్కడుందనేది అటవీశాఖకు సమాచారం లేదని అంటున్నారు.

వీటిలో 3303 నెంబర్ గల బీఎండబ్ల్యూ కారును 2017 డిసెంబర్ 11న అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయిస్తూ అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఉత్తర్వ్యులు జారీ చేశారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంతరామే అప్పట్లోనూ ఆ పోస్ట్ లో ఉన్నారు.

అయితే... 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్.. తిరిగి 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకూ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మళ్లీ అనంతరాము ఇప్పుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే... ఈ వాహనం ఎక్కడుందనేది మాత్రం అధికారికంగా అటవీశాఖకు సమాచారం లేదంట.

వీటితోపాటు 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించిన 2277 బ్లూ కలర్ బీఎండబ్ల్యూ వాహంతో పాటు... 2023 జూలైలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు కేటాయించిన ఇన్నోవా వాహనం కూడా ఎక్కడుందో సమాచారం లేదట. దీంతో... వీటిపై పవన్ నివేదిక కోరారు!

మరోపక్క వీటిలో ఓ బీఎండబ్ల్యూ కారును ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి సతీమణి హైదరాబాద్ లో వినియోగిస్తున్నట్లు అటవీశాఖ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది!