కోర్టులో అల్లుడ్ని కాల్చి చంపిన మాజీ పోలీసు ఉన్నతాధికారి
చండీగఢ్ లోని కోర్టు ఆవరణలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో కాల్పులు జరిపిన మామ.. ఒకపోలీసు ఉన్నతాధికారి కావటం గమనార్హం.
By: Tupaki Desk | 4 Aug 2024 5:41 AM GMTభార్యభర్తల మధ్య విడాకుల పంచాయితీ నడుస్తున్న వేళ.. అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. మధ్యవర్తిత్వం కోసం కోర్టుకు వచ్చిన సందర్భంగా అల్లుడిపై కాల్పులు జరిపి చంపిన మామ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. చండీగఢ్ లోని కోర్టు ఆవరణలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో కాల్పులు జరిపిన మామ.. ఒకపోలీసు ఉన్నతాధికారి కావటం గమనార్హం.
అదే సమయంలో.. మామ కాల్పుల్లో మరణించిన అల్లుడు కూడా మామూలు వ్యక్తి కాదు. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ అధికారి. ఉన్నత చదువులు చదివి.. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న అల్లుడు ఒకవైపు.. పంజాబ్ పోలీసు శాఖలో సహాయ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పని చేసిన మామ చేసిన ఈ దారుణం షాకిచ్చేలా ఉంది.
ఐసీఏఎస్ అధికారి అయిన హర్ ప్రీత్ సింగ్ కు మాజీ ఏఐజీగా పని చేసిన మాల్విందర్ కుమార్తె అమితోజ్ కౌర్ కు మధ్య వివాహ బంధంలో విభేదాలు ఉన్నాయి. విడాకుల ప్రాసెస్ లో ఉన్న వారు.. కోర్టుకు హాజరయ్యారు. ఈ విడాకుల కేసు 2023 నుంచి నడుస్తోంది.
ఈ ప్రాసెస్ లో భాగంగా శనివారం రెండు కుటుంబాల వారు చండీగఢ్ లోని సెక్టార్ 43లో ఉన్న చండీగఢ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు వచ్చాయి. కోర్టు ప్రొసీజర్ జరుగుతున్న వేళ.. మధ్యాహ్నం రెండు గంటల వేళలో మామ మాల్విందర్ బయటకు వచ్చారు. వచ్చీ రాగానే.. అక్కడే ఉన్న అల్లుడు హర్ ప్రీత్ సింగ్ పైన కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులకు పాల్పడిన మాల్విందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆవరణలో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.