Begin typing your search above and press return to search.

ఏసీబీ కోర్టులో బాబుకు ఎదురుదెబ్బ...రిమాండ్ పొడిగింపు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Oct 2023 12:45 PM GMT
ఏసీబీ కోర్టులో బాబుకు ఎదురుదెబ్బ...రిమాండ్ పొడిగింపు!
X

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 26 రోజులుగా చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది.

అవును... గత 26 రోజులుగా రాజమండ్రి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబుకు మరో షాకింగ్ ఘటన జరిగింది. ఆయన రిమాండ్ ను పొడిగించాలని సీఐడీ ఇవాళ మెమో దాఖలు చేసింది. దీనిపై ఏసీబీ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సమయంలో చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ ను ఈ నెల 19 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్‌ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌ గా జడ్జి ముందు హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఆ మెమోను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు... జ్యుడిషియల్‌ రిమాండ్‌ ను రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది. ఈ రెండు పిటిషన్లపైనా సుమారు రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇందులో భాగంగా... సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌ కుమార్‌ దూబే వాదనలు వినిపించారు!

ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్రను నిర్ధారించేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. అలాగే ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే అని తెలిపారు. ఇదే క్రమంలో… ఈ స్కాం లో చేతులు మారిన రూ.27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లినట్లు నిరూపించే ఆధారాల్ని ఆయన ఇవాళ కోర్టుకు సమర్పించారని తెలుస్తుంది. ఈ సమయంలో కస్టడీకి ఇస్తేనే మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని పొన్నవోలు వాదించారు.

మరోపక్క చంద్రబాబును రాజకీయ కక్షతోనే జైల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన లాయర్ ప్రమోద్ దూబే వాదించారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఒక్కరే తీసుకున్నట్లు చెప్పడం సరికాదని చెప్పుకొచ్చారు. అసలు స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదని, చంద్రబాబు కేవలం సీఎంగా మాత్రమే సంతకాలు చేశారని చెప్పారని తెలుస్తుంది.

ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పై విచారణ రేపు మధ్యాహ్నాం జరగనుంది. ఇదే సమయంలో రేపు (శుక్రవారం) మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ లకు సంబంధించిన పీటీ వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.