Begin typing your search above and press return to search.

కెనడా ఆగడం.. జైశంకర్ తో ప్రెస్ మీట్.. ఆసీస్ మీడియాపై వేటు

శత్రుత్వం ఉన్న పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో మినహా ఒక విధంగా చరిత్రలో ఇంతవరకు ఏ దేశంతోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   8 Nov 2024 7:39 AM GMT
కెనడా ఆగడం.. జైశంకర్ తో ప్రెస్ మీట్.. ఆసీస్ మీడియాపై వేటు
X

జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నంత కాలం కెనడా తీరు మారదేమో..? ఖలిస్థానీల విషయంలో వారి వైఖరి మారదేమో..? మరీ ముఖ్యంగా భారత్ పట్ల వ్యతిరేక ధోరణి కొనసాగుతుందేమో..? అసలు భారత్ వాసనే గిట్టదేమో..? తాజాగా ఆ దేశం తీసుకున్న చర్యలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. గత నెలలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతటి కనిష్ఠ స్థాయికి పడిపోయాయో అందరూ చూశారు. శత్రుత్వం ఉన్న పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో మినహా ఒక విధంగా చరిత్రలో ఇంతవరకు ఏ దేశంతోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అలా జరుగుతుండగానే..

కెనడాతో దౌత్య సంబంధాలు పడిపోతున్న వేళ.. గత వారం మరో కీలక ఘటన చోటుచేసుకుంది. హిందూ ఆలయాలపై, అక్కడి భక్తులపై ఖలిస్థానీలు దాడులు చేశారు. కాన్సులేట్ నూ లక్ష్యంగా చేసుకున్నారు. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి సందర్భంలోనే మరో ఘటన కూడా జరిగింది.

ఆయన వీడియోలు ప్రసారాం చేస్తారా?

ఓవైపు స్వదేశంలో హిందూ ఆలయాలపై దాడులు, మరోవైపు దౌత్య సంబంధాల క్షీణత.. అయినా భారత విషయంలో కెనడా తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు. మరింత దుందుడుకుగా వెళ్తోంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ ఉమ్మడి మీడియా సమావేశాన్ని ప్రసారం చేసిన ‘ఆస్ట్రేలియా టుడే’ మీడియా సంస్థపై చర్యలు తీసుకుంది. ఆ సంస్థ సామాజిక మాధ్యమ హ్యాండిళ్లను, కొన్ని పేజీలను కూడా కెనడా స్తంభింపజేసింది.

మేనేజింగ్ ఎడిటర్ మనోడే..

కెనడా చర్యలు తీసుకున్న ఆస్ట్రేలియా టుడే సంస్థ మేనేజింగ్ ఎడిటర్ జితార్థ్‌ జై భరద్వాజ్‌ ఇండియనే. తాజా పరిణామాపై ఆయన దీటుగానే స్పందించారు. అడ్డంకులు వస్తాయని అధైర్యపడబోం. ముఖ్యమైన కథనాలు, గొంతుకలను ప్రజలకు అందించాలనే మా లక్ష్యం చెదరదు. మాకు లభించిన మద్దతు స్వేచ్ఛాయుత మీడియా ప్రాముఖ్యతను చెబుతోంది.. అని పేర్కొన్నారు. పారదర్శకత, కచ్చితత్వంతో కూడిన కథనాలను అందించే హక్కు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం అని కుండబద్దలు కొట్టారు. కాగా, ఆస్ట్రేలియా టుడే పైన తీసుకున్న చర్యల పట్ల కెనడాను భారత్‌ తప్పుపట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై కెనడా చెప్పేదొకటి చేసేదొకటని మండిపడింది.