'కడప బాషా' ఎంత ముదురంటే? సిటీలో ఇద్దరితో కాపురం.. ఊళ్లో ఎంగేజ్ మెంట్!
కడప జిల్లాకు చెందిన బాషా అనే ముదురు కేసు లీలలు బయటకు వచ్చాయి. ఇతగాడి చేష్టల గురించి తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు
By: Tupaki Desk | 27 Oct 2023 4:30 PM GMTకడప జిల్లాకు చెందిన బాషా అనే ముదురు కేసు లీలలు బయటకు వచ్చాయి. ఇతగాడి చేష్టల గురించి తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో జాబ్ కోసం వచ్చిన ఇతగాడు.. ఒకే టైంలో ఒకరికి తెలీకుండా మరొకరితో సహజీవనం చేయటం ఒక ఎత్తు అయితే.. ఇద్దరికి తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊరికి వెళ్లి మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్న వైనం బయటకు వచ్చింది.
ఏపీలోని కడప జిల్లాకు చెందిన బాబా ఫక్రుద్దీన్ అలియాస్ బాషా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో స్టీవార్డుగా పని చేస్తుంటాడు. అతను సదరు ఆసుపత్రి మాదాపూర్ బ్రాంచ్ లో పని చేస్తున్న సమయంలో అక్కడే పని చేసే యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రహ్మత్ నగర్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఇల్లు తీసుకొని సహజీవనం షురూ చేశారు.
ఇదిలా ఉండగా.. అతను సదరు ఆసుపత్రికి చెందిన సికింద్రాబాద్ శాఖకు బదిలీ అయ్యాడు. అక్కడ మరో అమ్మాయికి మాయమాటలు చెప్పి.. కార్ఖానా ప్రాంతంలో ఇల్లు తీసుకొని సహజీవనం షురూ చేశాడు. ఇలా ఒకరికి తెలీకుండా మరొకరితో ఏకకాలంలో ఇద్దరిలో సహజీవనం చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల ఆరు నుంచి మొదటి యువతి ఫోన్ కు అందుబాటులో లేకుండాపోయాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అతడు స్పందించట్లేదు.
దీంతో.. ఆమె మధురానగర్ పోలీసుల్ని ఆశ్రయించింది. మరోవైపు రెండో మహిళ సైతం.. బాషా గురించి ఆరా తీయటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గురించి తెలుసుకొని.. తమ ఉదంతం గురించి చెప్పుకొచ్చింది. దీంతో.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కడప జిల్లాకు వెళ్లగా.. అక్కడ మరో యువతితో ఎంగేజ్ మెంట్ చేసుకోవటంలో బిజీగా ఉన్న విషయాన్ని గుర్తించాడు. అతడ్ని అదుపులోకి తీసుకొని సిటీకి తీసుకొచ్చారు. ట్విస్టు ఏమంటే.. ఇంత జరిగిన తర్వాత కూడా సహజీవనం చేస్తున్న ఇద్దరు యువతులు.. ఈ ముదురు కేసును ‘‘నేను పెళ్లి చేసుకుంటానంటే.. నేను పెళ్లి చేసుకుంటా’’ అని వాదులాడుకోవటం పోలీసులకు షాకింగ్ గా మారింది. ఇలాంటి మోసగాళ్లను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలన్న ఆలోచనే విస్మయానికి గురి చేసేలా చేసింది.