అయోధ్య రాముడు ఆదుకోలేదా? బీజేపీ ఓటమి!
గత ఏడాది ఆరు మాసాల కాలం పాటు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు... రామ భజన చేసిన విష యం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jun 2024 10:14 AM GMTగత ఏడాది ఆరు మాసాల కాలం పాటు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు... రామ భజన చేసిన విష యం తెలిసిందే. దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి పేరు మార్మోగిపోయింది. 500 ఏళ్ల తర్వాత.. తామే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నామని. తాము రాకపోయి ఉంటే.. లేక పోయి ఉంటే.. అయోధ్య రాముడు పూరి పాకలో బిక్కు బిక్కు మంటూ కాలం గడిపే వాడని కూడ.. ప్రధాని నరేంద్ర మోడీ వంటివారు ప్రచారం చేసుకున్నారు. అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్టను ఓ పెద్ద పెళ్లిలా చేశారు.
ఇక, ఈ తంతును ప్రత్యక్ష ప్రసారం ద్వారా 131 దేశాల్లో ఉన్నప్రజలకు కూడా చూపించారు. అలానే దేశవ్యాప్తంగా బాలరామయ్య అక్షతలను పంపిణీ చేశారు. ఇలా.. అయోధ్య రాముడిని.. ఆకాశానికి ఎత్తేశారు. మరి ఆయన కరుణించారా? బీజేపీ పక్షాన నిలిచి.. ఓట్లు కురిపించారా? అంటే. లేదనే చెప్పాలి. ఎందుకం టే.. కీలకమైన అయోధ్య ఉన్న పార్లమెంటు స్థానంలోనే బీజేపీ ఓడిపోయింది. ఇది కమల నాథులు ఊహించని పరిణామం. వారు కలలో కూడా.. ఇక్కడ ఓడిపోతామని అనుకోలేదు.
అంతేకాదు... అసలు తొలి గెలుపు కూడా.. ఈ నియోజకవర్గంలోనే ఉంటుందని ఆశ పెట్టుకున్నారు. కానీ, ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడి ప్రజలు బీజేపీ కంటే.. తమకు సమాజ్ వాదీ పార్టీనే కావాలని అనుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్.. 54567 ఓట్లతో భారీ విజయం దక్కించుకున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ పరాజయం పాలయ్యారు.
మరో కీలక విషయం ఏంటంటే.. యూపీలో గత ఎన్నికల్లో 70కి పైగా స్థానాలు దక్కించుకున్న బీజేపీ..ఈ సారి 33 సీట్లకే పరిమితం అయింది. నిజానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు యూపీ సీట్లు అత్యంత కీలకం. అందుకే బీజేపీ ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేసింది. అయినప్పటికీ.. ప్రజలు ఆ పపార్టీని ఆదరించలేదు. సో.. దీనిని బట్టి.. అయోధ్య రాముడు బీజేపీని ఆదుకోలేక పోయాడని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. రాముడికి ఇల్లు(గుడి) కట్టించిన బీజేపీని ఆయనే ఆదుకుంటాడన్న ఆ పార్టీ నేతల మాటలు కూడా వృథాఅయ్యాయి.