Begin typing your search above and press return to search.

నకిలీ కోర్టు, నకిలీ జడ్జ్, నకిలీ తీర్పు... నగదు మాత్రం ఒరిజినల్!

వస్తువుల వరకూ అయితే సరే కానీ.. ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించాడో వ్యక్తి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 8:30 PM GMT
నకిలీ కోర్టు, నకిలీ జడ్జ్, నకిలీ తీర్పు... నగదు మాత్రం ఒరిజినల్!
X

ఈ ప్రపంచంలోని నేటి సమాజంలో ఆయింట్మెంట్ నుంచి ఆపిల్ ప్రోడక్ట్స్ వరకూ.. అన్నింటిలోనూ నకిలీ దొరుకుతుంది. ప్రపంచంలో ఏదైనా ఒరిజినల్ ప్రొడక్ట్ విడుదలయ్యిందంటే.. దానికి నకిలీ ప్రొడక్ట్ కూడా దానికంటే వేగంగా మార్కెట్ లో దర్శనమిస్తున్న పరిస్థితి. వస్తువుల వరకూ అయితే సరే కానీ.. ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించాడో వ్యక్తి.

అవును... ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టును ఏర్పాటు చేసి, అందులో అతడే జడ్జి అవతారం ఎత్తి అందరినీ నమ్మించాడు. ఈ సమయంలో కొంతమందికి అనుకూలంగా తీర్పునిస్తూ.. భారీ వసూళ్లకు తెరలేపాడు. సుమారు గత ఐదేళ్లుగా ఈ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో ఓ కేసు విషయంలో జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వ్యులు ఇవ్వడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వస్తే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఏకంగా కోర్టునే ఏర్పాటు చేసాడు. అందులో తానే జడ్జి అని నమ్మించాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కేసులను సేకరించడం మొదలుపెట్టాడు.

ఇదే సమయంలో ఓ నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి.. వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టాడు! ఆ తర్వాత ఆ కేసులపై నకిలీ విచారణ చేపట్టేవాడు. కొందరికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తూ.. అందుకు ప్రతిఫలంగా భారీగా డబ్బులు వసూలు చేసేవాడు! ఈ నకిలీ కోర్టులో అతడితోపాటు నకిలీ సిబ్బంది, నకిలీ లాయర్లు ఎవరి స్థాయిలో వాళ్లు పెర్ఫార్మెన్స్ చేశారు.

ఇలా సాగిపోతున్న నకిలీ దందాలో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా.. 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తాజాగా ఓ వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చాడు. అక్కడితో ఆగకుండా.. ఈ తీర్పు వెలువరించే సమయంలో ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే అవి నకిలీవని రిజిస్ట్రార్ గుర్తించింది.

దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు.. నకిలీ జడ్జి మోరిస్ శామ్యూల్ బండారన్ని బయటపెట్టారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుసుకొని షాకవ్వడం పోలీసుల వంతు అయ్యిందని అంటున్నారు.