హైదరాబాద్ రోడ్లపై సింహం స్వేచ్ఛగా.. నిజమెంత?
నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి గురువారం ఉదయం సింహం తప్పించుకుని కనిపించకుండా పోయిందని జూ ప్రతినిధులు `ఎక్స్`లో పోస్ట్ చేయడంతో `రెడ్ అలర్ట్` వచ్చింది.
By: Tupaki Desk | 20 Dec 2024 3:48 AM GMTహైదరాబాద్ రోడ్ల పై జూ నుంచి తప్పించుకున్న సింహం స్వేచ్ఛగా తిరుగుతోందా? అంటే అవుననే ఫేక్ ప్రచారం సాగుతోంది. జూ నుండి సింహం తప్పించుకోవడంపై `జూ` అధికారులే సోషల్ మీడియాలో `రెడ్ అలర్ట్` కూడా ప్రకటించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి గురువారం ఉదయం సింహం తప్పించుకుని కనిపించకుండా పోయిందని జూ ప్రతినిధులు అని చెప్పుకుంటున్న వారు `ఎక్స్`లో పోస్ట్ చేయడంతో `రెడ్ అలర్ట్` వచ్చింది. @nzphyderabadzoo ఖాతాలో జూ నుండి ఉదయం సింహం కనిపించకుండా పోయిందని, ఎవరైనా గుర్తించినట్లయితే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతూ `రెడ్ అలర్ట్ హైదరాబాద్`ను జారీ చేయడం కలకలం రేపింది.
అయితే కొద్దిసేపటికే ఇది ఫేక్ అని తేలింది. ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజల్లో ఆందోళన పెంచుతుంది. ఈ ప్రచారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ పోస్ట్ ను వెంటనే తొలగించాలని ఆదేశించినట్టు జూ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే `జూ`పై ఆసక్తిని పెంచడానికి సోషల్ మీడియా ప్రచారంలో ఇది భాగమని తెలంగాణ అటవీ శాఖ డైరెక్టర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ తరహా ప్రచారానికి అటవీశాఖ అధికారుల అనుమతి ప్రయివేట్ సంస్థ(సోషల్ మీడియా నిర్వాహకుల)కు లభించిందని కూడా అతడు చెప్పడం గమనార్హం.
జూ ప్రచారం కోసమా? సింహం సినిమా ప్రచారం కోసమా?
అయితే ఈ ప్రచారం త్వరలో విడుదలకు సిద్ధమైన సింహం సినిమా ప్రచారం కోసమని కూడా తెలుస్తోంది. సింహం గురించిన కొత్త చిత్రం విడుదల కాబోతోందని, సినిమా విడుదలను సద్వినియోగం చేసుకొని Xపై రెండు భాగాల పోస్ట్‌ను ఉంచాలని జూని వార్తల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు కూడా అటవీ శాఖ డైరెక్టర్ చెప్పినట్టు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అయితే జూ క్యూరేటర్ జి. వసంత దీనిని ఖండించారని, ఈ విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించినట్టు సదరు కథనం వెల్లడించింది. జూ నుంచి జంతువులేవీ తప్పించుకోలేదని అధికారి తెలిపారు. తప్పుడు వార్తలతో జూ కి ప్రచారం కోరుకోవడం బాధ్యతారాహిత్యమని, ఇది అటవీశాఖకు ముప్పు తెస్తుందని కూడా సదరు అధికారిణి వ్యాఖ్యానించారు. సింహం తప్పించుకుని హైదరాబాద్ రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేస్తోందన్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందారు. చాలామంది ఈ గందరగోళానికి జూ అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని ఇప్పుడు విమర్శిస్తున్నారు.