బాప్ రే...అయిదున్నర లక్షల నకిలీ ఓట్లు...!
చాలా వరకూ డబుల్ ఓట్లు ఉన్నాయని అవి 2018 నుంచి అలాగే ఉన్నాయని వైసీపీ నుంచి వస్తున్న వారోపణ.
By: Tupaki Desk | 9 Jan 2024 3:38 AM GMTఏపీలో దొంగ ఓట్లు అని ఒక వైపు రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అసలు ఎన్ని దొంగ ఓట్లు ఉంటాయి అన్నది కూడా చర్చకు వస్తోంది. దీని మీద విపక్షాలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి. అదే విధంగా చూస్తే అధికార వైసీపీ కూడా ఎప్పటికపుడు ఫిర్యాదులు చేస్తోంది.
చాలా వరకూ డబుల్ ఓట్లు ఉన్నాయని అవి 2018 నుంచి అలాగే ఉన్నాయని వైసీపీ నుంచి వస్తున్న వారోపణ. అంటే హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో కూడా ఓట్లు ఉన్న వారు ఓట్లను తొలగించాలని వైసీపీ కోరుతోంది. ఇక టీడీపీ ఫిర్యాదు ఏంటి అంటే తమ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు అని.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఓట్లను తొలగిస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ఎవరి వాదన నిజం అన్నది కూడా తలెత్తుతున్న సందేహం. దీని మీద ఎన్నికల అధికారులు కూడా దృష్టి పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీద ఎన్ని అనర్హత ఓట్లు ఉన్నాయి అన్న దాని మీద మీడియాకు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఓటర్ల అభ్యంతరాలు, దొంగ ఓట్ల తొలగింపు ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామన్నారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామన్నారు.
ఇప్పటిదాకా వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదులతో 14.48 లక్షల ఓట్లను పరిశీలించి 5,64,819 ఓట్లను అనర్హమైనవిగా గుర్తించామన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని వెల్లడించారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. ఇలా అనర్హతతో కూడిన ఓట్ల విషయంలో ఉదాశీనంగా వ్యవహరించిన వారుగా గుర్తించి ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించామన్నారు.
మొత్తం మీద చూస్తే అయిదున్నర లక్షల ఓట్లు అంటే పెద్ద నంబరే. మరి దీని మీద యాక్షన్ కి దిగామని ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు. అయితే ఈ నంబర్ ఇంకా కాదు ఏకంగా ఇరవై లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ అంటోంది. వైసీపీ కూడా చాలా ఎక్కువ నంబర్ లో డబల్ ఓటింగ్ కలిగిన వారు ఉన్నారని అంటోంది. మరి ఇదే నంబర్ తో ఆగుతారా లేక ఇంకా నకిలీ ఓట్లు ఉంటాయా వాటి మీద యాక్షన్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.