Begin typing your search above and press return to search.

పాడు పేదరికం ఎంత పని చేసింది? అయ్యో అనిపించే విషాదం

పెళ్లికి వెళ్లకున్నా చావుకు మాత్రం పక్కాగా వెళ్లాలన్న సామెత తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ పాత సామెత మానవీయ బంధాల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేస్తుంది.

By:  Tupaki Desk   |   4 March 2025 11:00 AM IST
పాడు పేదరికం ఎంత పని చేసింది? అయ్యో అనిపించే విషాదం
X

పెళ్లికి వెళ్లకున్నా చావుకు మాత్రం పక్కాగా వెళ్లాలన్న సామెత తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ పాత సామెత మానవీయ బంధాల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేస్తుంది. కానీ.. పాడు పేదరికం అలాంటి అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి పెద్ద చనిపోతే.. అల్లంత దూరాన ఉన్న భార్య.. పిల్లలు కడచూపునకు నోచుకోని దైన్యం గురించి తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. చివరకు మరో మార్గం లేక అంత్యక్రియల్ని వీడియోకాల్ లో చూడాల్సిన దుస్థితి.

నేపాల్ కు చెందిన 34 ఏళ్ల ప్రేమ్ రావల్ కూకట్ పల్లికి వచ్చి హౌస్ కీపింగ్ చేస్తుంటాడు. అతడికి భార్య యశోదా.. ముగ్గురు కుమార్తెలు.. కుమారుడితో కలిసి కేపీహెచ్ బీ కాలనీ నాలుగో ఫేజ్ లో ఉంటాడు. నెల రోజుల క్రితం యశోదా పిల్లలతో కలిసి నేపాల్ కు వెళ్లగా ప్రేమ్ మాత్రం స్నేహితుడితో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సమస్యలతో శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తాను చనిపోతున్నట్లుగా పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి చెప్పాడు.

ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు నేపాల్ నుంచి హైదరాబాద్ కు రాలేని పరిస్థితి. అదే సమయంలో మృతదేహాన్ని తీసుకెళ్లలేని దుస్థితి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో ఉన్న ప్రేమ్ అన్నయ్య వచ్చి కేపీహెచ్ బీలోని ఏడో ఫేజ్ శ్మశానవాటికలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమ సంస్కారాల్ని వాట్సప్ వీడియోకాల్ లో కుటుంబ సభ్యులకు చూపించగా.. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆస్తికల్ని సేకరించి తమ ఊరుకు బయలుదేరి.. మిగిలిన కార్యక్రమాల్ని చేస్తామన్న మాటలు విన్నంతనే అప్రయత్నంగా కంటతడి వచ్చేస్తున్న పరిస్థితి.