ఆన్ లైన్ గేమ్ ఉచ్చులో హైదరాబాద్ ఫ్యామిలీ బలి
చక్కటి కొడుకు. సమర్థురాలైన భార్య. వెరసి.. ఆ భర్తకు ఎలాంటి లోటు లేదు. ఇలాంటి హ్యపీ ఫ్యామిలీని చేజేతులారా నాశనం చేసుకున్న ఒక యువకుడి ఉదంతమిది
By: Tupaki Desk | 9 April 2024 7:23 AM GMTచక్కటి కొడుకు. సమర్థురాలైన భార్య. వెరసి.. ఆ భర్తకు ఎలాంటి లోటు లేదు. ఇలాంటి హ్యపీ ఫ్యామిలీని చేజేతులారా నాశనం చేసుకున్న ఒక యువకుడి ఉదంతమిది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ విషాద ఉదంతం హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడి.. దాని ఉచ్చులో చిక్కుకుపోయి అందులో నుంచి బయటకు రాలేక మూడేళ్ల కొడుక్కి.. భార్యకు విషమిచ్చి చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల ఇందిరకు గతంలో పెళ్లైంది. గుండెపోటుతో భర్త మరణించాడు. దీంతో ఆమె నాలుగేళ్ల క్రితం రామంతపూర్ కు చెందిన 42 ఏళ్ల ఆనంద్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆనంద్ అప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఉన్నాడు. ఈ దంపతులు మూడేళ్లుగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని సన్ సిటీలో ఒక అపార్టుమెంట్ ను కొనుగోలు చేసి ఉంటున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇందిర ప్రైవేటు ఉద్యోగిని. జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తోంది.
ఆనంద్ విషయానికి వస్తే.. అతను కొంతకాలం పాల వ్యాపారం చేసి.. ఖాళీగా ఉంటున్నాడు. అతనికి ఆన్ లైన్ గేమ్ లు ఆడే అలవాటు ఉంది. అందులో తరచూ డబ్బులు పోగొట్టుకునేవాడు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు భార్య బంగారాన్ని అమ్మేశాడు. ఇటీవల కారును అమ్మేశాడు. అయినప్పటికీ అప్పులు తీరకపోవటంతో ప్లాట్ కూడా అమ్మేద్దామని భార్యకు చెప్పాడు. దీంతో.. దంపతుల మధ్య గొడవలు జరిగాయి.వారికి ఇందిర తల్లిదండ్రులు.. బంధువులు సర్ది చెప్పారు. అయినా గొడవలు ఆగలేదు.
దీంతో.. అప్పులకు సంబంధించి ఏదైనా పరిష్కారం చేసేందుకు ఇంటికి రావాల్సిందిగా ఇందిర తల్లిదండ్రులు ఆహ్వానించారు. సోమవారం అందరూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆనంద్ కూల్ డ్రింక్ కొనుగోలు చేసి అందులో విషయం కలిపి తొలుత వారికి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత తాను కూడా తాగేసినట్లుగా భావిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్ మత్తులో పడి భారీగా అప్పులు చేశాడని.. కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులకు అతడి వైఖరే కారణమని ఇందిర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్ ల మత్తులో పడి తన జీవితాన్నే కాదు.. తన కుటుంబాన్ని బలి తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది.