Begin typing your search above and press return to search.

రైతు ఇంటి నుంచి.. ఫిలింసిటీ దాకా..ఇదీ రామోజీ ప్రస్థానం

1990లో మొదలైన ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో జర్నలిస్టులను తయారుచేసింది. ఇక 1996లో మొదలైన రామోజీ ఫిలింసిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 9:35 AM GMT
రైతు ఇంటి నుంచి.. ఫిలింసిటీ దాకా..ఇదీ రామోజీ ప్రస్థానం
X

'పనిలోనే విశ్రాంతి'.. 'కాలంతో పాటు మారితేనే మనుగడ' ఇవీ.. 'ఈనాడు' గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నమ్మిన సూత్రాలు. విద్యాభ్యాసం అయిపోయినప్పటి నుంచి ఆయన వీటిని తూచ తప్పకుండా పాటించారు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి చూస్తే.. దాదాపు 70 ఏళ్ల ప్రస్థానం ఆయనది. ఆ ప్రయాణం పూర్తి వివరాలు ఇవీ..

పెద పారుపూడిలో పుట్టి..క్రిష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో చెరుకూరి రామోజీరావు 1936 నవంబరు 16న వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. మధ్య తరగతి రైతు కుటుంబం వీరిది. రామోజీకి ఇద్దరు అక్కలు. ఇక 1947లో గుడివాడ మునిసిపల్ హైస్కూల్ లో 8వ తరగతిలో చేరి 1951 వరకు చదివారు. గుడివాడ కాలేజీలోనే ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) చదివారు.

జీవితాన్ని మలుపుతిప్పిన ఢిల్లీ కొలువు రామోజీరావు జీవితాన్ని మలుపు తిప్పింది ఢిల్లీ ఉద్యోగం. అక్కడ ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసిన ఆయన మూడేళ్లకు పైగా పనిచేశారు. 1961లో తాతినేని రమాదేవిని వివాహం చేసుకున్నారు. మరుసటి ఏడాదిలోనే హైదరాబాద్ వచ్చేశారు.

1962 అక్టోబరులో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు. 1965లో కిరణ్ యాడ్స్ (పెద్ద కుమారుడు కిరణ్ పేరిట)ను స్థాపించారు. 1967-69 మధ్య ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట వ్యాపారం నిర్వహించారు.

1969లో అన్నదాత అంటూ రైతులకు సలహాలు, సూచనల కోసం అన్నదాత మేగజీన్ ను తీసుకొచ్చారు. బహుశా ఈ స్ఫూర్తితోనే 1974 ఆగస్టు 10న 'ఈనాడు' పత్రికను ప్రారంభించారు. అయితేచ 1970లో ఇమేజెస్ ఔట్ డోర్ యాడ్ ఏజెన్సీనీ మొదలుపెట్టారు.

1972-73 మధ్య విశాఖపట్నంలో డాల్ఫిన్స్ హోటల్ నిర్మాణం మొదుపెట్టారు. 1980లో డాల్ఫిన్స్ త్రీస్టార్ హోటల్ ప్రారంభమైంది. ఈనాడు మొదలైన రెండు రోజులకే మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంపీఎల్)ను నెలకొల్పారు. 1975 డిసెంబరు 17న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్, 1976 అక్టోబరు 3న సితార సినీ మేగజీన్, 1978 ఫిబ్రవరిలో చతుర, విపుల నవలలు, 1980లో ప్రియాఫుడ్స్, 1983లో సినీ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ను స్థాపించారు.

ప్రపంచానికే తలమానికం ఫిలింసిటీ..

1990లో మొదలైన ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో జర్నలిస్టులను తయారుచేసింది. ఇక 1996లో మొదలైన రామోజీ ఫిలింసిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇక 2002లో ఆరు ప్రాంతీయ ఈటీవీ చానెళ్లు, అదే ఏడాది రమాదేవి పబ్లిక్ స్కూల్ ను నెలకొల్పారు రామోజీ.