వ్యవ’సాయం’ .. రూ.1.52 లక్షల కోట్లు !
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు.
By: Tupaki Desk | 23 July 2024 7:58 AM GMTవ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. ఈ మేరకు బడ్జెట్ లో రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని, ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతామని, వాతావరణ పరిస్థితులను తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటలకు సంబంధించి 109 కొత్త వంగడాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తుందని, నూనెగింజల ఉత్పత్తి కోసం ఒక వ్యూహాన్ని అవలంభిస్తామని, రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ విలువను పెంచడం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మద్దతుతో పంట అనంతర కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం చేస్తామని అన్నారు.
పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం కోసం రూ. 60,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.