Begin typing your search above and press return to search.

ఇవేం మాటలు? కశ్మీర్ ను గాజాతో పోల్చటమా పెద్ద మనిషి?

సంచలన వ్యాఖ్యలు చేసే జమ్ముకశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:24 AM GMT
ఇవేం మాటలు? కశ్మీర్ ను గాజాతో పోల్చటమా పెద్ద మనిషి?
X

సంచలన వ్యాఖ్యలు చేసే జమ్ముకశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెనుకా ముందు చూసుకోకుండా.. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే అలవాటున్న ఆయన మరోసారి కశ్మీర్ పై భారత సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ మధ్య చర్చల ద్వారా కశ్మీర్ వివాదానికి ముగింపు పలకకుంటే కశ్మీర్ కు గాజాకు పట్టిన గతే పడుతుందని పేర్కొంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించటం.. అనంతరం ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించిన వేళలో ఫరూక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అంతేకాదు.. మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై చేసిన విమర్శల్ని పలువురు తప్పు పడుతున్నారు. పాకిస్థాన్ కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని.. భారత్ తో చర్చలు జరిపేందుకు నవాజ్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా.. చర్చలకు మనమే సిద్ధంగా లేమన్నారు.

ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకుంటే కశ్మీర్ కు గాజాకు పట్టిన గతే పడుతుంని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ.. పూంచ్ జిల్లాలను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు రహస్య స్థావరాలుగా చేసుకున్న గుహల్ని కూల్చేయాలన్న ఆదేశాల్ని ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ పరిణామాలపై మాట్లాడిన ఫరూక్.. చర్చల ద్వారానే పాక్ తో పంచాయితీ తీర్చుకోవాలని సూచన చేయటం గమనార్హం.

భారత్ ఎన్నిసార్లు చర్చలకు మొగ్గు చూపినా.. తన బుద్ది మార్చుకోని పాక్ తీరు గురించి ఫరూక్ కు తెలీదా? అన్నది ప్రశ్న. అయినప్పటికి పాక్ కు వంతపాడినట్లుగా ఉన్న ఈ కశ్మీరీ నేత తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఈ సందర్బంగా ఫరూక్ చేసిన వ్యాఖ్యను చూస్తే.. అప్పట్లో వాజ్ పేయ్ చెప్పిన మాటల్ని తప్పుడు అర్థంతో వ్యాఖ్యానించినట్లుగా చెప్పాలి.

''మనం స్నేహితుల్ని మనం మార్చగలం. కానీ మన పొరుగువారిని మార్చలేం. మనం మన పొరుగువారితో స్నేహపూర్వకంగా ఉంటే.. ఇద్దరు డెవలప్ చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి'' అన్నట్లుగా గుర్తు చేశారు.అయితే.. ఫరూక్ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. పొరుగువారితో మనం ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ.. మన ఇంట్లోని లాకర్ మీదా.. సంపద మీద ఫోకస్ పెట్టి.. కుట్రలు పన్నే వారితో ఏం చర్చలు జరపగలం? అన్న ప్రశ్న ఫరూక్ మదిలోకి ఎందుకు రాదన్నదిఅసలు ప్రశ్న.