బసవతారకం వద్ద కారు బీభత్సం.. ఏకంగా పడుకున్న వారిపైకి..
నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఈ ఘటన జరిగింది.
By: Tupaki Desk | 25 Jan 2025 6:36 AM GMTపొద్దుపొద్దున్నే హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కారును వదిలి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఓనర్‌ను గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఆస్పత్రి వద్ద ముగ్గురు ఫుట్ పాత్‌పై నిద్రిస్తుండగా కారు అదుపుతప్పి వారి పైకి దూసుకొచ్చింది. కారు డ్రైవర్ పారిపోవడంతో.. కారు ఎవరిది..? కారు ఓనర్ ఎవరు..? పరారైన నిందితుడు ఎవరు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ యాక్సిడెంట్లలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయాల పాలయ్యారు. ఇంకా కొంత మంది అయితే జీవిత కాలం వైకల్యం పొందిన వారు ఉన్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి.