సినీ ఫక్కీలో 20 ఏళ్లకు తన తండ్రిని కలిసిన కుమారుడు!
ఈ సందర్భంగా సుఖపాల్ సింగ్ కుమారుడు రిన్ మాట్లాడుతూ తన తండ్రి సుఖపాల్ సింగ్ అనే పేరు తప్ప తనకు మరే విషయాలు తెలియదన్నాడు.
By: Tupaki Desk | 24 Aug 2024 1:30 PM GMT20 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలిసిన కుమారుడి కథ ఇది. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన సుఖ్ పాల్ సింగ్ గతంలో జపాన్ కు చెందిన సచీ తకాహటాను థాయ్ లాండ్‌లో కలిశాడు, వీరిద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సచీ భారత్ కు రావడం.. అలాగే సుఖపాల్ సింగ్ జపాన్ కు వెళ్తూ ఉండటం జరిగాయి. 2002లో వీరు పెళ్లి చేసుకోగా 2023లో సుఖ పాల్ సింగ్, సచీలకు రిన్ అనే కుమారుడు జన్మించాడు.
అయితే వేర్వేరు దేశాల వారు కావడంతో సుఖపాల్ సింగ్, సచీ పెళ్లికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఇద్దరి మధ్య అపార్థాలు పొడసూపాయి. దీంతో 2004లో సుఖ పాల్ సింగ్ భారత్ కు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలో అతడు 2007లో గుర్విందర్ జిత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి అవ్లీన్ అనే కుమార్తె జన్మించింది.
మరోవైపు సుఖపాల్ సింగ్ మొదటి భార్య సచీ, కుమారుడు రిన్ జపాన్ లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు, వంశ వృక్షం వివరాలపై రిన్ తన కాలేజీలో ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని అతడు తన తల్లిని ప్రశ్నించాడు. దీంతో సచీ.. నీ తండ్రి సుఖపాల్ సింగ్ అని.. పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉంటాడని చెప్పింది. కొన్ని ఫొటోలను కూడా అతడికి చూపింది.
దీంతో తన తండ్రిని వెతుక్కుంటూ రిన్ ఇండియాకు వచ్చాడు. అమృత్ సర్ లో తన తండ్రి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఆగస్టు 18న రిన్ అమృత్ సర్ చేరుకున్నాడు. తన తల్లి సచీ తకాహటా ఇచ్చిన అడ్రస్, ఫొటోలు, వస్తువులతో అమృత్ సర్ లోని ఇంటి ఇంటికి, ప్రతి షాపుకు వెళ్లి తన తండ్రి కోసం గాలించాడు. చివరకు అతడి ప్రయత్నం ఫలించింది.
సుఖ పాల్ సింగ్ యవ్వనంలో ఉన్నప్పుడు అతడి చిత్రాలను గుర్తించిన షాపులవారు అతడి అడ్రస్ ను అతడి కుమారుడు రిన్ కు చూపారు. అమృత్ సర్ లోని లోహర్కా రోడ్ లోని సుఖపాల్ సింగ్ ఇంటికి కుమారుడు రిన్ వెళ్లాడు.
అయితే రిన్ ఇంటికి వెళ్ళినపుడు అక్కడ సుఖపాల్ సింగ్ లేడు. రక్షాబంధన్ కోసం తన సోదరి ఇంటికి వెళ్లాడు. జపాన్ నుంచి తన కుమారుడు వచ్చాడని సుఖపాల్ సింగ్ సోదరుడు ఫోన్ చేసి చెప్పడంతో సుఖపాల్ సింగ్ ఆనందం పట్టలేక ఇంటికి పరుగెత్తుకువచ్చాడు. ఇంటికి వచ్చి తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. తండ్రీకొడుకు ఒకరికొకరు సంతోష సంబరాల్లో మునిగిపోయారు.
ఈ సందర్భంగా సుఖపాల్ సింగ్ కుమారుడు రిన్ మాట్లాడుతూ తన తండ్రి సుఖపాల్ సింగ్ అనే పేరు తప్ప తనకు మరే విషయాలు తెలియదన్నాడు. తన తల్లి చెప్పిన కొన్ని వివరాల ఆధారంగా అమృత్ సర్ వచ్చి తన తండ్రి కోసం గాలించానని చివరకు కలుసుకోగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా రక్షా బంధన్ నాడు అవ్లీన్ తన జపనీస్ సోదరుడికి రాఖీ కట్టింది. అలాగే సుఖపాల్ సింగ్ రెండో భార్య గుర్విందర్ జిత్ కౌర్.. రిన్ ను తన సొంత కొడుకుగా స్వాగతించింది. అంతేకాకుండా సుఖపాల్ సింగ్ తన మొదటి భార్య జపాన్ కు చెందిన సచీతో ఫోన్ తో మాట్లాడాడు. కుమారుడు తన వద్ద ఉన్నాడని, ఆందోళన చెందవద్దని తెలిపాడు.
తన తండ్రి, తన తల్లి కనీసం ఒక్కసారైనా కలవాలని తాను కోరుకుంటున్నానని రిన్ తెలిపాడు. ఇక క్రమం తప్పకుండా అమృత్ సర్ కు వస్తానని, తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో కొన్నాళ్లు ఉంటానని వెల్లడించాడు.