Begin typing your search above and press return to search.

షాక్: సెల్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని విషమిచ్చి చంపేసిన తండ్రి

స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే విజయ్ కు విశాల్ అనే కొడుకు ఉన్నాడు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 6:30 AM GMT
షాక్: సెల్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని విషమిచ్చి చంపేసిన తండ్రి
X

తప్పుడు పనులు చేస్తున్నాడన్న కోపంతో పద్నాలుగేళ్ల కొడుక్కి విషమిచ్చి చంపేసిన తండ్రి ఉదంతమిది. విన్నంతనే ఉలిక్కిపడేలా మారిన ఈ ఉదంతం మహారాష్ట్రలోని షోలాపూర్ లో చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే విజయ్ కు విశాల్ అనే కొడుకు ఉన్నాడు. అతడికి పద్నాలుగేళ్లు. ఇంటికి దగ్గర్లోని స్కూల్లో చదివిస్తున్నాడు.

అయితే.. స్కూల్ కు ఫోన్ తీసుకెళ్లే విశాల్.. అందులో అశ్లీల ఫోటోల్ని చూస్తుండేవాడు. అంతేకాదు.. అతడి తీరుపై స్కూల్ టీచర్లు కంప్లైంట్ చేసేశారు. ఎన్నిసార్లు మందలించినా మాట వినని.. తీరు మార్చుకోని కొడుకు తీరుతో విసుగెత్తిపోయాడు. ఆహారంలో విషమిచ్చి చంపేశాడు. కొడుకును చంపేస్తున్న విషయం భార్యకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా చంపేసి.. డెడ్ బాడీని ఇంటికి దగ్గర్లోని మురికి కాలువలో పడేశాడు.

తన కొడుకు కనిపించట్లేదని జనవరి 13న పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు విజయ్ దంపతులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ విచారణలో భాగంగా విజయ్ ఇంటి దగ్గర్లోని ఒక మురికి కాల్వలో డెడ్ బాడీని గుర్తించారు. తమకు అందిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలకు.. డెడ్ బాడీకి సంబంధించిన అంశాలకు పొంతన లేకపోవటంతో పోలీసులకు సందేహం వచ్చింది. అయితే.. పోలీసులు తాను చేసిన నేరాన్ని గుర్తిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకున్న విజయ్.. తాను చేసిన పనిని తొలుత భార్యకు చెప్పి.. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ విధిస్తూ.. రెండు రోజులు సోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాల్ని జారీ చేసింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.