Begin typing your search above and press return to search.

తండ్రి కాంగ్రెస్ తరఫున ప్రచారం.. కొడుకు బీఆర్ఎస్ అభ్యర్థి

కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా మారతారు.. అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, అక్కాచెల్లెళ్లు, భార్యాభర్తలు ఇలా ఎవరి మధ్యనైనా చిచ్చురేపగలవు రాజకీయాలు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 6:41 AM GMT
తండ్రి కాంగ్రెస్ తరఫున ప్రచారం.. కొడుకు బీఆర్ఎస్ అభ్యర్థి
X

రాజకీయాలంటే అంతే మరి.. బద్ధ విరోధులు మిత్రులవుతారు.. ప్రాణ స్నేహితులు శత్రువులవుతారు. కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా మారతారు.. అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, అక్కాచెల్లెళ్లు, భార్యాభర్తలు ఇలా ఎవరి మధ్యనైనా చిచ్చురేపగలవు రాజకీయాలు. మరీ.. శత్రుత్వం స్థాయిలో కాకున్నా.. విభేదాలు అయినా సహజం. ఇలాంటివి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో బయటపడుతుంటాయి. ఇక ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల్లో ఉంటే చెప్పనవసరం లేదు.

ఆయన కమ్యూనిస్టు దిగ్గజం

ప్రస్తుతం తరంలో ఎవరికీ తెలియకపోవచ్చుగానీ.. 20 ఏళ్ల కిందటివరకు సీపీఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అంటే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో పెద్దే పేరున్న నాయకుడు. వయోభారం రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఏపీలో శాసనమండలి రద్దయిన సందర్భంలో ఆయన సభ్యులు. పునరుద్ధరణకు నోచుకున్న అనంతరం మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. 1989, 1994లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఐ జాతీయ కార్యవర్గంలోనూ సభ్యుడిగా చేశారు. సీపీఐ జెండా కట్టిన కర్రను ఎడమ భుజాన వేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పువ్వాడ నాగేశ్వరరావు అంటే.. కమ్యూనిస్టు దిగ్గజం అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముక్తకంఠంతో ఒప్పుకొంటారు.

భిన్న బాటలో కుమారుడి పయనం

పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడే ప్రస్తుత రాష్ట్ర రవాణా మంత్రి అజయ్ కుమార్. తండ్రి వామపక్ష దిగ్గజం అయినా, భిన్నమైన రాజకీయ బాటను ఎంచుకున్న అజయ్.. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీలో కొనసాగారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఉమ్మడి ఖమ్మంలో వైసీపీ బలోపేతంలో అజయ్ కుమార్ ది కీలక పాత్ర. అయితే, వైసీపీ తెలంగాణకు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో ఆయన కాంగ్రెస్ లో వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018లో నామా నాగేశ్వరరావుపైన నెగ్గారు. మూడోసారి ఖమ్మం బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఢీకొంటున్నారు.

అటు నాన్న.. ఇటు కుమారుడు

85 ఏళ్లు పైబడిన పువ్వాడ నాగేశ్వరరావు ఇప్పటికీ సీపీఐలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పువ్వాడ నాగేశ్వరరావు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే.. తుమ్మల ప్రధాన ప్రత్యర్థి ఎవరో కాదు.. పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కుమారే. అయినప్పటికీ పార్టీ నిర్దేశించినట్లుగా తుమ్మలకు మద్దతుగా నిలుస్తున్నారు పువ్వాడ నాగేశ్వరరావు. ఇప్పుడే గతంలోనూ ఆయన పార్టీ లైన్ కు కట్టుబడి.. కుమారుడికి వ్యతిరేకంగా పనిచేశారు. బయటివారికి అరుదుగా అనిపించినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మాత్రం ఇది చాలా సహజమే. అయితే, రాజకీయంగా పూర్తి భిన్నమైన మార్గంలో ప్రయాణించినా.. తండ్రీ కుమారుల మధ్య విభేదాలు లేకపోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇటీవల పెద్ద పువ్వాడ అస్వస్థతకు గురైతే.. చిన్న పువ్వాడ అత్యంత జాగ్రత్తగా చూసుకుని కోలుకునేలా చేశారు.