అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు వెళ్లిన ముస్లిం పెద్దాయనపై ఫత్వా!
అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న వారిలో ఆయన ఒకరు.
By: Tupaki Desk | 30 Jan 2024 4:31 AM GMTఅయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగటం తెలిసిందే. ఈ కీలక కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మొదలుకొని పలు రంగాలకు చెందిన దిగ్గజాలు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. వివిధ వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. ఇలా హాజరైన వారిలో అఖిల భారత ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అమ్మద్ ఇల్ యాసి ఒకరు. తాజాగా ఆయనకు వ్యక్తిగత హోదాలో ఒక ఫత్వా జారీ కావటం కలకలంగా మారింది. అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న వారిలో ఆయన ఒకరు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందజేయగా.. రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్ యాసికి ఇన్విటేషన్లు పంపారు. అయితే.. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇల్ యాసి హాజరయ్యారు. తాను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావటంతో పాటు.. ఒక వర్గం దూషణకు దిగినట్లుగా ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయ్యిందన్న ఆయన.. ‘‘నా ఫోన్ నెంబరును సోషల్ మీడియాలో ఉంచారు. అన్ని మసీదు అథారిటీలకు.. ఇమామ్ లకు చేరవేశారు. నన్ను బహిష్కరించాలని కోరారు. నేను క్షమాపణలు చెప్పాలి.. నా పదవి నుంచి వైదొలగాలని అందులో ఉంది’’ అని పేర్కొన్నారు.
తనకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపిందని.. దాన్ని తాను అంగీకరించానని తెలిపారు. ఆ వేడుకకు వెళ్లాలా? వద్దా? అని రెండు రోజులు తాను ఆలోచించినట్లు చెప్పిన ఆయన.. ‘‘ఎందుకంటే నా జీవితంలో ఇదే అతి పెద్ద నిర్ణయం అవుతుంది. మతసామరస్యం.. దేశానికి మంచి చేయటం కోసం.. జాతిప్రయోజనాల కోసమే అయోధ్యకు వెళ్లాను. అక్కడి ప్రజలు నాకు స్వాగతం పలికారు. సాధువులు.. ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్టు నా నిర్ణయాన్ని స్వాగతించింది. నేను ప్రేమను పంచటానికి అక్కడకు వెళ్లాను. అది నెరవేరింది. మన ప్రార్థనలు.. ఆచారాలు.. మతం.. కులం.. విశ్వాసాలు వేర్వేరు అయినా మన అతి పెద్ద మతం మాత్రం మానవత్వమే. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు’’ అని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందన్న ఆయన.. ‘‘సర్వ ధర్మ సంభవ్’’ భారత ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తోంది. చంద్రుడి మీద భారత్ కాలు మోపింది. వివ్వగురు కావటానికి చేస్తున్న ప్రయాణంలో మనమంతా ఒకటిగా.. బలంగా ఉండాలి. ఇది అందరి భారత్. అందుకే ఇది గొప్పదేశం’’ అని ఆయన స్పష్టం చేశారు.