Begin typing your search above and press return to search.

నైట్ డ్యూటీకి భయపడుతున్న వైద్యులు.. తాజా రిపోర్టు చెప్పిన నిజం

రాత్రిపూట విధులంటే వైద్యులు భయపడుతున్నారని.. మూడింట ఒక వంతు మందిలో ఈ భయాందోళనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:30 AM GMT
నైట్ డ్యూటీకి భయపడుతున్న వైద్యులు.. తాజా రిపోర్టు చెప్పిన నిజం
X

కోల్ కతాలో చోటు చేసుకున్న పరిణామం దేశలోని వైద్యుల మీద తీవ్ర ప్రభావం చూపిందా? నైట్ డ్యూటీ విషయంలో వైద్యుల ఆలోచన ఎలా ఉంది? వారెలా ఫీల్ అవుతున్నారు? లాంటి అంశాల మీద భారత వైద్య మండలి తాజాగా అధ్యయనం నిర్వహించింది. ఈ సందర్భంగా సంచలన అంశాలు వెలుగు చూశాయి.

రాత్రిపూట విధులంటే వైద్యులు భయపడుతున్నారని.. మూడింట ఒక వంతు మందిలో ఈ భయాందోళనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తీవ్రమైన అభద్రతా భావంతో పాటు కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాల్ని తమ వెంట తెచ్చుకుంటున్నట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. మౌలిక సదుపాయాలు లేకపోవటం.. డ్యూటీ రూంలో కూడా ఉండకపోవటంతో పాటు.. భారీగా ఉంటున్న రోగులతో తీవ్రమైన అభద్రతాభావంతో వైద్యులు ఉంటున్నట్లు చెబుతున్నారు.

22 రాష్ట్రాల్లో సాగిన ఈ అధ్యయనంలో మొత్తం 3885 మంది వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85 శాతం మంది 35 ఏళ్ల లోపున్న వైద్యులే ఉన్నారు. ఈ ఆధ్యయనాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో చేపట్టారు. దేశంలోని 45 శాతం ఆసుపత్రుల్లో డాక్టర్లకు డ్యూటీ రూంలు లేవు. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న వారు తీవ్రమైన అభద్రతా భావంతోఉన్నారు. వారంతా ఇప్పుడు తమకు డ్యూటీ రూం ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. కొందరికి డ్యూటీ రూం ఉన్నా.. తమకు ప్రైవసీ ఉండటం లేదని.. భారీగా వస్తున్న రోగుల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు.

కొందరికి రూంలు ఉన్నా.. వాటికి అటాచ్డ్ బాత్రూంలు లేవని.. ప్రత్యామ్నాయంగా తమకు రెస్టు రూంలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఆసుపత్రుల్లో సెక్యూరిటీ లేదని 24.1 శాతం మంది వైద్యులు అభిప్రాయపడితే.. మహిళలకు ఏ మాత్రం సురక్షితం కాదంటూ 11.4 శాతం మంది వైద్యులు తెలిపారు. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిలో మహిళలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

పక్కా సెక్యురిటీతో పాటు.. సీసీ టీవీ కెమేరాను ఏర్పాటు చేయటంతో పాటు.. ఆసుపత్రి ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయాలన్న వారు.. అలారం వ్యవస్థను తీసుకురావాలని కోరుతున్నారు. నైట్ డ్యూటీకి వెళుతున్న మహిళా వైద్యుల్లో కొందరు చిన్నపాటి కత్తి.. పిప్పర్ స్ప్రే లాంటి వాటిని తీసుకెళుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. రోగుల బంధువులు కొందరు మద్యం తాగి వైద్యుల్ని బెదిరిస్తున్నారని.. ఇలాంటి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు.