Begin typing your search above and press return to search.

200 ఏళ్ల చరిత్రలో ఆ దేశానికి తొలి మహిళా అధ్యక్ష బాధ్యత

దీంతో.. మెక్సికో స్వతంత్ర చరిత్రలో తొలిసారి దేశాధ్యక్ష పీఠాన్ని ఎక్కనున్న తొలి మహిళగా రికార్డును క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:48 AM GMT
200 ఏళ్ల చరిత్రలో ఆ దేశానికి తొలి మహిళా అధ్యక్ష బాధ్యత
X

ఘన చరిత్ర ఉంటే మాత్రం ఏం లాభం? అన్నట్లుగా ఉంటుంది మెక్సికో పరిస్థితి. అలాంటి ఆ దేశ ఇమేజ్ తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామంతో మారుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆదివారం జరిగిన మెక్సికో దేశాధ్యక్ష పదవికి తొలిసారిగా ఒక మహిళా నేత ఎన్నికయ్యారు. 200 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు ఏ మహిళా నేత కూడా దేశాధ్యక్ష పదవిని చేపట్టింది లేదు. ఆ చరిత్రను తిరగరాసేలా 61 ఏళ్ల వామపక్ష మహిళా నేత క్లాడియా షేన్ బామ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో.. మెక్సికో స్వతంత్ర చరిత్రలో తొలిసారి దేశాధ్యక్ష పీఠాన్ని ఎక్కనున్న తొలి మహిళగా రికార్డును క్రియేట్ చేశారు.

యూదు మూలాలు ఉన్న తొలి దేశాధ్యక్షురాలిగా నిలవనున్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా 60 శాతం ఓట్లు ఆమెకు లభించాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన ప్రత్యర్థులు ఇద్దరు ఇప్పటికే తనతో ఫోన్ లో మాట్లాడారని.. వారు తనను అభినందించినట్లుగా పేర్కొన్నారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నట్లుగా చెప్పిన ఆమె.. సంతోషంగా కనిపించారు.

అయితే.. తన విజయాన్ని తన ఖాతాలో వేసుకోని ఆమె.. ఇది తాను సాధించిన ఒంటరి విజయం కాదని... లక్షలాది మంది తల్లులు మొదలుకొని ఎందరో కూతుళ్లు.. మనమరాళ్ల దాకా అందరు మహిళలు సాధించిన విజయంగా పేర్కొన్నారు. విపక్ష కూటమి మహిళకు అవకాశం ఇవ్వటంతో.. రెండు ప్రధాన పార్టీలు దేశాధ్యక్ష పదవి కోసం మహిళల్నే ఎంపిక చేశారు. ఇలా జరగటం మెక్సికో చరిత్రలో తొలిసారి.

తాజాగా విజయంసాధించిన షేన్ బామ్ విషయానికి వస్తే.. ఆమెకున్న పేరు ప్రఖ్యాతులు ఎక్కువే. ఎనర్జీ ఇంజనీరింగ్ లో పపీహెచ్ డీ చేసిన ఆమెను అందరూ ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుస్తుంటారు. పర్యావరణవేత్తగా ఆమెకు చాలా మంచి పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ శాస్త్రవేత్తల టీంలో ఆమె ఒక సభ్యురాలు. మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీకి మేయర్ గా పని చేసిన తొలి మహిళ కూడా ఆమె. ఆమె పూర్వీకుల విషయానికి వస్తే వారంతా నియంత హిట్లర్ హింసాకాండను తప్పించుకోవటానికి యూరప్ నుంచి మెక్సికోకు వలస వచ్చారు. మెక్సికో నగరంలో పుట్టిన షేన్ బామ్ 2000లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్ కు 28 శాతం.. మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్ కు 10 శాతం ఓట్లు వచ్చినట్లుగా అక్కడి ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆరేళ్ల పదవీ కాలం ఉండే దేశాధ్యక్ష పదవికి సంబంధించి మెక్సికోలో ఉన్న అతి పెద్ద పరిమితి ఏమంటే.. ఒకసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన వారు మరోసారి ఆ పదవిని చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. ఈ కారణంగానే తాజా మాజీ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ గడిచిన ఆరేళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసుల్ని గెలుచుకున్నప్పటికి రెండోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచే వీల్లేకపోయింది.

తాజా దేశాధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టనున్న షేన్ బామ్ అక్టోబరు ఒకటి నుంచి దేశాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం చేస్తారు. మహిళలపై హింసకు మెక్సికోలో ప్రపంచంలోనే మొదటిస్థానం ఉంది. ఆ సమస్యను రూపుమాపాల్సిన బాధ్యతో పాటు.. హింస.. గ్యాంగ్ వార్లు.. డ్రగ్స్.. హ్యుమన్ ట్రాఫికింగ్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు లాంటివి కట్టడి చేయాల్సిన భారం కొత్త అధ్యక్షురాలి మీద ఉంది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్ని అమలుచేస్తూనే ఈ సమస్యల్ని కూడా కట్టడి చేయాల్సి ఉంది.