జనాభా పెరుగుతోంది సరే... మరి సంతానోత్పత్తి రేటో..?
అంటే... వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 11 July 2024 1:30 PM GMTజూలై 11వ తేదీనా ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము. ప్రధానంగా ఈ రోజున ప్రపంచ జనాభా పెరుగుదల, ఫలితంగా ఎదురవుతున్న సమస్యలు మొదలైన వాటిపై చర్చ జరుగుతుంటుంది. వీటిపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజు జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే ప్రస్తుతం మాత్రం జనాభా పెరుగుదలతో పాటు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది!
అవును... ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పెరుగుతున్న ప్రపంచ జనాభాతో పాటు పూర్తిగా తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటుపైనా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అంటే... జనాభా పెరుగుతోంది! ఇదే సమయంలో గత కొన్ని దశాబ్ధాలతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడిపోతోంది.
అంటే... వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. ఈ క్షీణత 20వ శతాబ్ధం మధ్యలో దాదాపు 2 శాతంగా ఉండగా... ఇప్పుడు ఒక్కశాతానికి పడిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం ఆందోళన కలిగించే అంశమే అని అంటున్నారు నిపుణులు. ఇటీవల జననాల రేటు తగ్గడం వల్ల... అనేక దేశాల్లో యువకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెబుతున్నారు.
క్షీణిస్తున్న సంతానోత్పత్తి రేటు!:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోయింది! ఉదాహరణకు 1965 ప్రాంతంలో సంతానోత్పత్తి రేటు 5.1గా ఉంటే.. 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3, 2000లో 2.8 గా ఉండగా... 2021లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 కి పడిపోయింది.
భారత్ లో సంతానోత్పత్తి రేటు!:
ఇటీవల విడుదలైన లాన్సెట్ నివేదిక ప్రకారం... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ లోనూ ఈ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని.. సంతానోత్పత్తి రేటు పడిపోతుండటమే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.
భారత్ లో 1950లో సంతానోత్పత్తి రేటు 6.1గా ఉండగా.. 2021కి వచ్చేసరికి అది 2 కంటే దిగువకు పడిపోయిన పరిస్థితి. ఇది ఇలానే కొనసాగితే 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కి పడిపోవచ్చని ఆ నివేదిక హెచ్చరించింది.
ఇక మొత్తం ఆసియాలో చూసినా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రతీ స్త్రీకి 0.9 పిల్లల చొప్పున ప్రపంచ వ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలవగా... ఆ తర్వాత స్థానాల్లో ప్యూర్టో రికో (1.0), మాల్టా, సింగపూర్, హాంకాంగ్ లలో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలు ఉన్నారు!
సంతానోత్పత్తి రేటు ఈ స్థాయిలో పడిపోవడానికి పలు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా ప్రధానంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవన శైలి, పని ఒత్తిళ్లు, ఆందోళనలు, పెరుగుతున్న కాలుష్యంతో పాటు ఆలస్యంగా వివాహం చేసుకొవడం వంటివి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన టాప్ టు కంట్రీస్ అయిన చైనా (1.7), ఇండియా (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. దీంతో... చైనా ఈ రేటు పెంచడంపై దృష్టిపెట్టింది. వాస్తవానికి 1980 - 2016 మధ్య చైనాలో ఒకటే బిడ్డ విధానం ఉండేది. అయితే... 2021 ఆగస్ట్ అనంతరం ముగ్గురు పిల్లలను కలిగి ఉండొచ్చని అధికారికంగా చట్టం చేసింది.
ఇక భారత్ విషయానికొస్తే ఒకప్పుడు పిల్లలే అస్తులు అనే రోజుల నుంచి... వన్ ఆర్ నన్ అనే పరిస్థితి అనధికారికంగా వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అయితే సంతానోత్పత్తి రేటులో తగ్గుదల, ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి.. దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రహావితం చేస్తోందని నిపుణులు అంటున్నారు!