ఎన్నికలకు ముందే వైసీపీలో పండగ.. విషయం ఏంటంటే
దీనికి కారణం.. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్ర ముగించి నేటికి(జనవరి 9) ఐదేళ్లు పూర్తయ్యాయి.
By: Tupaki Desk | 9 Jan 2024 9:00 AM GMTమరో రెండు మాసాల్లో జరగనున్న ఎన్నికల్లో తమదే గెలుపు ఖాయమని వైసీపీ నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే. రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని వారు అంటున్నారు. సరే.. ఇది ఎలా ఉన్నా.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. జిల్లాలు, మండలాల కార్యాలయాల్లో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి.. మిఠాయిలు పంచుకుని.. బాణాసంచా కాల్చి నాయకులు సంబంరాలు చేసుకుంటున్నారు.
దీనికి కారణం.. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్ర ముగించి నేటికి(జనవరి 9) ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆనందంలో తేలియాడుతున్నాయి. కీలక నాయకులు ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనగా.. క్షేత్రస్థాయి నాయకులు మండలాల్లోని వైసీపీ కార్యాలయాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు. `ప్రజాసంకల్ప యాత్ర` పేరుతో 2019 ఎన్నికలకు ముందు.. సీఎం జగన్ పాదయాత్రు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందుగానే ఆయన ప్రజల్లోకి వచ్చారు. అప్పటి టీడీపీ హయాంలో అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని.. ఎన్నిసార్లు విన్నవించినా.. తమను అవమానిస్తున్నారని పేర్కొంటూ.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ.. వైసీపీ అధినేత.. అప్పటివిపక్ష నాయకుడు జగన్.. ప్రజల్లోకి వచ్చారు. మొత్తం 3648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. నవంబరు 17, 2017లో ప్రారంభించిన ఈ యాత్ర.. 2019, జనవరి 9వ తేదీన ముగిసింది.
వర్షం వచ్చినా.. తుఫానే వచ్చినా.. ఎండైనా.. శీతల గాలులు వణికించినా.. జగన్ తన ప్రజాసంకల్ప యాత్రను విస్మరించకుండా ముందుకు సాగారు. గ్రామీణ స్థాయి నుంచి నగరం వరకు అన్ని వర్గాల ప్రజలతోనూ మమేకం అయ్యారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ ప్రాతిపదికగానే ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోను రూపొందించింది.
సమస్యలకు మూలమైన ఆర్థిక సాయంపై కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే అమ్మ ఒడి, చేదోడు, వాహన మిత్ర, ఆసరా, నేతన్న నేస్తం, రైతులకు ఆర్థిక సాయం ఇలా.. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రజాసంకల్ప యాత్ర పూర్తియన రోజు(జనవరి 9)ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు.