Begin typing your search above and press return to search.

విమాన ఛార్జీలకు రెక్కలు.. పండుగల వేళ వాతలు

ఆగస్టు వచ్చిందంటే చాలు పండగల సీజన్ మొదలైనట్లే. శ్రావణమాసంతో మొదలయ్యే పండగలు దీపావళి వరకు నాన్ స్టాప్ గా సాగుతుంటాయి

By:  Tupaki Desk   |   20 Aug 2024 5:30 AM GMT
విమాన ఛార్జీలకు రెక్కలు.. పండుగల వేళ వాతలు
X

ఆగస్టు వచ్చిందంటే చాలు పండగల సీజన్ మొదలైనట్లే. శ్రావణమాసంతో మొదలయ్యే పండగలు దీపావళి వరకు నాన్ స్టాప్ గా సాగుతుంటాయి. అది పూర్తయ్యాక కాస్త గ్యాప్ వచ్చి.. క్రిస్మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతితో పర్వదినాల హడావుడి తగ్గుతుంది. పండగల వేళ.. సొంతూర్లకు వెళ్లేందుకు.. బంధువుల వద్దకు వెళ్లేందుకు వీలుగా ప్రయాణాలు చేస్తుంటారు. దీన్నో అవకాశంగా తీసుకున్న విమానయాన సంస్థలు.. పండగల సీజన్ లో విమాన ఛార్జీలను పెంచేశారు. కనిష్ఠంగా పది శాతం.. గరిష్ఠంగా పాతిక పర్సెంట్ వరకు పెరిగిన విషయాన్ని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది.

సెప్టెంబరు 15న జరిగే మాలయాళీల ఓనం పండగ సందర్భంగా కేరళలోని నగరాలకు వెళ్లే ప్రతి విమాన సర్వీసు ఛార్జీలు 20 - 25 శాతం పెంచేసినట్లుగా పేర్కొన్నారు. అక్టోబరు 30 - నవంబరు 5 మధ్య ఢిల్లీ - చెన్నై నాన్ స్టాప్ విమానంలో ఒక వైపు ఎకానమీ సగటు ఛార్జీ 25 శాతం పెరిగి రూ.7618గా ఉందని సదరు పోర్టల్ వెల్లడించింది. ముంబయి - హైదరాబాద్ మార్గంలోనూ 21 శాతం ఛార్జీ పెరిగింది. ఢిల్లీ - గోవా, ఢిల్లీ - అహ్మదాబాద్ మార్గాల్లో ఛార్జీలు 19 శాతం పెరగ్గా.. ఇతర మారగాల్లో ఛార్జీల భారం ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.

దీపావళి పండుగ అయిన నవంబరు 10-16 మధ్య ప్రయాణ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది దీపావళికి ప్రయాణ గిరాకీతో పాటు ఛార్జీలు కూడా భారీగా పెరుగుతన్నాయి. ఢిల్లీ - చెన్నై, ముంబయి - బెంగళూరు, ఢిల్లీ - హైదరాబాద్ లాంటి రద్దీ మార్గాల్లో ఛార్జీలు 10-15 శాతం పెరిగినట్లుగా పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గత ఏడాది కంటే తాజాగా కొన్ని మార్గాల్లో మాత్రం ఛార్జీలు తగ్గాయి.

ముంబయి - అహ్మదాబాద్ మధ్య టికెట్ ఛార్జీలు 27 శాతం తగ్గగా.. ముంబయి - ఉదయ్ పూర్ మార్గంలో 25 శాతం ఛార్జీ తగ్గింది. బెంగళూరు - హైదరాబాద్ మార్గంలో విమాన ఛార్జి 23 శాతం తగ్గి రూ.3383గా ఉందని.. ముంబయి - జమ్ము మార్గంలో విమాన ఛార్జీ తగ్గినట్లుగా పేర్కొంది. ఓనం వేళ హైదరాబాద్ - తిరువనంతపురం మధ్య విమాన టికెట్ ధర 30 శాతం పెరిగినట్లుగా పేర్కొంది. దేశీయ విమాన ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి. 2023 జూన్ లో 1.24కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే.. సరిగ్గా అదే నెలలో ఈ ఏడాది 1.32 కోట్ల మంది ప్రయాణించారు.

ఇక.. 2023 జులైలో 1.21 కోట్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణిస్తే.. ఈ ఏడాది అదే నెలలో 1.29 కోట్ల మంది ప్రయాణించటం గమనార్హం. 2023 జనవరి నుంచి జులై మధ్య మొత్తం దేశీయ విమాన ప్రయాణికులు 8.81 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది అదే సమయానికి 9.23 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. ఇందులో ఇండిగో వాటా అత్యధికం. మొత్తం ప్రయాణికుల్లో 62 శాతం మంది ఇండిగోలో ప్రయాణిస్తే.. తర్వాతి వాటా ఎయిరిండియా 14.3 శాతం.. విస్తారా 10 శాతం.. ఆకాశ ఎయిర్ 4.7 శాతం.. ఏఐఎక్స్ కనెక్టు 4.5 శాతం.. స్పైస్ జెట్ 3.1 శాతంగా ఉంది.