ఫైబర్ నెట్లో 410 ఉద్యోగులపై వేటు!
ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 24 Dec 2024 11:30 AM GMTఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగుల్లో చాలా మంది ఎలాంటి నియామకపత్రాలు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారని, మరికొందరు ఫైబర్ నెట్లో ఉద్యోగాలు చేస్తూ వేరేచోట విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు.
ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇటీవల ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డి గత ఐదేళ్లు సంస్థలో చోటుచేసుకున్న కార్యకలాపాలను తెలుసుకున్నారు. ఫైబర్ నెట్ సంస్థ ద్వారా జీతాలు తీసుకుంటూ చాలా మంది వేరేచోట ఉంటున్నారని గుర్తించారు. ఇలాంటి వారిలో తొలివిడతగా 410 మందిపై వేటు వేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో గ్రామాలకు కూడా వేగవంతమైన ఇంటర్ నెట్ అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్ స్థాపించింది. 2019లో టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు ఈ సంస్థలో 108 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విడతల వారీగా ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది. ఇలా 2024 జూన్ లో ఆ పార్టీ అధికారం కోల్పోయేనాటికి ఫైబర్ నెట్ లో 1360 మంది ఉద్యోగులు జీతాలు తీసుకునేవారు. వీరిలో ఇప్పుడు 410 మందిని తొలగించారు. ఉద్యోగాల నుంచి తీసేసిన వారిపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, సరైన పద్ధతి పాటించకపోవడం, విధులకు హాజరుకాకపోవడం వల్ల అందరినీ ఒకేసారి తొలగించాల్సివచ్చిందని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు.
తొలగించిన వారిలో ఏ ఒక్కరూ ప్రాపర్ గా రిక్రూట్ కాలేదని, ఎవరూ ఉద్యోగాలకు రాలేదని, ఎవరైనా తాము సక్రమంగా ఉద్యోగాల్లో చేరామని నిరూపిస్తే, తిరిగి ఉద్యోగాలిస్తామని, లేనిపక్షంలో గతంలో తీసుకున్న జీతాలను రికవరీ చేస్తామని హెచ్చరించారు జీవీ రెడ్డి. ఒకేసారి 410 మందిని తీసివేయడం సంచలనంగా మారింది. వీరంతా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందే.
ఉద్యోగుల నిర్వాకం వల్ల ఏపీ ఫైబర్ నెట్ రూ. 2160 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, సంస్థను దివాళా అంచుకు తీసుకు వెళ్లారని చైర్మన్ మండిపడ్డారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే సంస్థ ఎందుకు నష్టాల్లోకి వెళ్లిపోతుందని నిలదీశారు. తొలగించిన ఉద్యోగులు ఎవరైనా ఆందోళనలకు సిద్ధమైతే కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు జీవీ రెడ్డి.