ఫైబర్ నెట్ కేసులో అనూహ్య పరిణామం... ఆస్తుల అటాచ్ కు అనుమతి!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Nov 2023 3:38 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి! ఈ సమయంలో ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) ని అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ఆదేశించింది.
అవును... ఏపీ ఫైబర్ నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. వాస్తవానికి ఈ ఫైబర్ నెట్ స్కాం కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ.. ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు పలువురుకి చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది.
ఇదే సమయంలో... సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఇచ్చిన అనుమతి విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించింది. ఈ క్రమంలో... నిందితులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతివ్వాలని పిటిషన్ లో సీఐడీ కోరింది. దీంతో... మొత్తం రూ.114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతిస్తూ తాజాగా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫైబర్ నెట్ కేసులో అటాచ్ కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవే!:
తుమ్మల గోపీచంద్ (ఏ11), ఆయన సతీమణి తుమ్మల పవన దేవి, ఆయన ఎండీగా ఉన్న టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్ సంస్థ ఆస్తులు.. కనుమూరి కోటేశ్వరరావు (ఏ23)తో పాటు ఆయన డైరెక్టర్ గా ఉన్న నెప్ టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ సంస్థ ఆస్తులు జప్తు చేయాలని సీఐడీ అభ్యర్థించింది.
ఇదే సమయంలో... గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని విన్నవించింది.
ఈ కేసు విచారణలో సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. నిధుల దుర్వినియోగ ఆరోపణ 2014నాటిది అయితే అంతకు ముందున్న ఆస్తులను ఎలా జప్తు చేస్తారని న్యాయాధికారి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. దుర్వినియోగం అయిన నిధుల మొత్తానికి విలువచేసే ఆస్తులను జప్తు చేసే అధికారం న్యాయస్థానానికి ఉందని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా తీర్పు వెళ్లడిస్తూ... ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.
కాగా... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్ నెట్ లో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ లు ఉండగా.. ఏ-25 గా చంద్రబాబు పేరును చేర్చింది సీఐడీ.