పదిహేను మంది సీఎంలు...జనాలు పట్టించుకుంటారా...?
హాయిగా కడుపులో చల్ల కదలకుండా బీయారెస్ పాలన ఉంది, ఆగమాగం అయి కాంగ్రెస్ కి ఓటు వేస్తే కనుక బతుకులు బుగ్గి పాలు అవుతాయి గుర్తు పెట్టుకోండి అని కేసీయార్ పదే పదే హెచ్చరిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Nov 2023 9:38 AM GMTతెలంగాణాలో కాంగ్రెస్ వర్సెస్ బీయారెస్ అన్నట్లుగా హోరాహోరీ పోరు సాగుతోంది. మొదట్లో అంతా తేలికగా తీసుకున్న గులాబీదళానికి ఈ ఎన్నికలు చాలా సంక్లిష్టంగా మారబోతున్నాయన్నది అర్ధం అయింది అంటున్నారు. దాంతో బీయారెస్ తన సౌండ్ పెంచింది. బీజేపీని పూర్తిగా వదిలేసి కాంగ్రెస్ మీదనే విమర్శలు చేయడం మొదలెట్టింది.
గత కొద్ది రోజులుగా బీయారెస్ అగ్రనాయకత్వం తీరు చూస్తూంటే కాంగ్రెస్ నే తమ పదునైన విమర్శలతో చాకిరేవు పెడుతున్నాయి. హాయిగా కడుపులో చల్ల కదలకుండా బీయారెస్ పాలన ఉంది, ఆగమాగం అయి కాంగ్రెస్ కి ఓటు వేస్తే కనుక బతుకులు బుగ్గి పాలు అవుతాయి గుర్తు పెట్టుకోండి అని కేసీయార్ పదే పదే హెచ్చరిస్తున్నారు.
అంతే కాదు ఆయన ఎన్నికల సభలలో కాంగ్రెస్ కి ముఖ్యమంత్రులు ఎందరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సీఎం కావాలని కోరుకుంటున్న వారి జాబితా ఏకంగా పదిహేను మంది దాకా ఉందని ఒక లిస్ట్ బయటపెట్టారు.
వీరంతా సీఎంలు అయితే ఇక పాలన ఎక్కడ. ఇంతమంది అవసరమా అని ప్రశ్నించారు. ఇదే మాటను కాస్తా మార్చి కేటీయార్ కూడా అంటున్నారు ప్రతీ ఆరు నెలలకూ ఒక సీఎం తెలంగాణాలో మారుతారు. ఢిల్లీ నుంచి హై కమాండ్ ఏమి చెబితే అదే తెలంగాణాలో సీఎం లు ఎవరు ఉన్నా చేయాలి. సొంతంగా వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు.
మొత్తం తెలంగాణా అభివృద్ధి నాశనం అవుతుంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బ తిందని, అదంతా హైదరాబాద్ కి షిఫ్ట్ అయి 28 శాతం మేర పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.రేపటి రోజున పొరపాటున కనుక కాంగ్రెస్ అధికారంలో వస్తే కర్నాటక లాగానే తెలంగాణా మారుతుందని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ బూం కూడా ఉండదని, అంతా ఎక్కడిది అక్కడే పడి ఉంటుందని ఆయన అంటున్నారు.
అదే విధంగా హరీష్ రావు కూడా తమకు ఒక్కరే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చెబుతున్నారు. తమ ముఖ్యమంత్రి ఎవరో జనాలకు చెబుతున్నారు. కేసీయార్ మా నాయకుడు, రెండవ మాటకు తావు లేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీయారెస్ లో కుర్చీల లొల్లి ఉండదని, సీఎం సీటు కోసం పంచాయతీ అంతకంటే ఉండదని కూడా స్పష్టం చేస్తున్నారు
అదే కాంగ్రెస్ వస్తే కుర్చీల కోసం కొట్లాటతోనే కాలం మొత్తం సరిపోతుందని, దించుడు ఎక్కించుడు అన్న దాని మీదనే కాంగ్రెస్ నేతలు దృష్టి ఉంటుందని అంటున్నారు. ఇలా బీయారెస్ అగ్ర నాయకత్వం తమ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. రాజకీయ అస్థిరత తెలంగాణాలో రాజ్యమేలుతుందని కుక్కలు చింపిన విస్తరి గా అంతా మారుతుందని, ప్రగతి కుంటుపడుతుందని కూడా చెబుతూ వస్తోంది.
ఇక న్యూస్ టాప్ అనే సంస్థ తాజాగా చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎవరిదో తెలియక జనాల్లో గందరగోళం ఏర్పడుతోందని పేర్కొంది. సీఎం అభ్యర్ధి ఎవరో తెలియకుండా కాంగ్రెస్ కి ఓటేస్తే రేపటి రోజున స్థిరమైన పాలన సాగుతుందా అన్నది కూడా చర్చనీయాంశం అవుతోందిట.
ఇవన్నీ ఇలా ఉంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు బీయారెస్ విమర్శలకు ధీటైన జవాబు ఇస్తున్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మారుస్తారు అన్నది తప్పు అని అంటున్నారు. కర్నాటకలో అలా జరగలేదని, రాజస్థాన్ లో కూడా ఒకే సీఎం ఎన్నికల నుంచి ఉంటూ వస్తున్నారని, చత్తీస్ ఘడ్ లో సీఎం కంటిన్యూ అవుతున్నారని ఎన్నో వివరణలు ఇస్తోంది.
ముఖ్యమంత్రులను మార్చే సీన్ ఉండదని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అంటేనే సుస్థిరత అని, తమ పార్టీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుందని, దాని వల్ల తెలంగాణా అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుందని చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే ముఖ్యమంత్రుల మార్పు అస్థిరత అని బీయారెస్ చేస్తున్న ప్రచారాన్ని జనాలు ఎంతవరకూ నమ్ముతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. అలాగే సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పకపోవడం కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ని సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణాలో చెప్పకపోవడం వ్యూహంలో భాగమా అని కూడా అంతా ఆలోచిస్తున్నారు.