కేసు పెట్టు.. పదవి పట్టు..!!
పూర్ణేష్ మోడీకి ఏకంగా దాద్రానగర్ హవేలీ - దామన్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా అధిష్ఠానం నియమిం చింది.
By: Tupaki Desk | 18 Nov 2023 4:14 PM GMTఇదేదో ఎన్నికల నినాదం మాదిరిగా ఉందని అనుకుంటున్నారా? కాదు. బీజేపీలో జాతీయ స్థాయిలో వినిపిస్తున్న నినాదం! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమే. దేశంలో కీలకనేతలపై కేసులు పెట్టిన బీజేపీలోని సామాన్య నాయకులకు ఆ పార్టీ పెద్దలు కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఈ పరంపరలోనే.. తాజాగా గతంలో కాంగ్రెస్ అగ్రనేత.. రాహుల్‌గాంధీపై `మోడీ` ఇంటి పేరుతో విమర్శలు గుప్పించారంటూ.. కేసు పెట్టి.. రాహుల్‌ను ముప్పుతిప్పలు పెట్టిన సామాన్య నాయకుడు.. పూర్ణేష్ మోడీకి కీలక పదవిని అప్పగించారు.
పూర్ణేష్ మోడీకి ఏకంగా దాద్రానగర్ హవేలీ - దామన్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా అధిష్ఠానం నియమిం చింది. ఇదేమీ తక్కువ పదవేమీ కాదు. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతమే అయినా.. మునిసిపల్ కార్పొరేషన్ ఉంది. సో.. అలాంటి ప్రాంతానికి బీజేపీ పార్టీ ఇంచార్జ్‌గా ఆయనను నియమించారు. ఇక, మల్లికార్జున ఖర్గేపై విమర్శలు గుప్పించి.. ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టిన దుష్యంత్ పటేల్‌కు కూడా బీజేపీ అధిష్టానం మంచి గుర్తింపే ఇచ్చింది. ఆయనను కో-ఇంచార్జ్‌గా నియమించింది. ఈ రెండుపదవులు కూడా పార్టీలో కేంద్ర కమిటీతో సమానం.
ఎవరి పూర్ణేష్ మోడీ..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన బీజేపీలో సామాన్య నాయకుడు పూర్ణేష్ మోడీ. అయితే.. 2019లో కర్ణాటకలోని కొల్లార్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోడీ ఇంటి పేరు’ను ప్రస్తావిస్తూ దొంగలందరికీ ఇదే ఇంటి పేరు ఎందుకు వుంటుందో! అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆరు మాసాల తర్వాత.. గుజరాత్‌లో పూర్ణేష్ మోడీ ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనేకేసు కట్టడం.. సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయడం తెలిసిందే. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ అంతర్మథనంలో పడిపోయింది. మొత్తానికి ఒక పెద్ద కలకలం కూడా రేగింది. ఇలా.. కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెట్టినపూర్ణేష్‌కు పార్టీ రుణం తీర్చుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఎవరీ దుష్యంత్?
దుష్యంత్ కూడా.. గుజరాత్‌కు చెందిన నాయకుడే. కాంగ్రెస్ జాతీయ పగ్గాలు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పుడు.. ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``కాంగ్రెస్ అధికారంలో ఉంటే..ఎస్సీలు పనికిరాలేదు. ఇప్పుడుకష్ట కాలంలో చేతులు దులుపుకొని ఎస్సీలను బలివశువు చేసేందుకు ఖర్గేను కత్తుల పీఠంపై కూర్చోబెట్టారు`` అని చేసిన వ్యాఖ్యలు.. దేశంలో ప్రకంపనలు పుట్టించాయి. దీనికి సోనియా బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సో.. ఇలా కాంగ్రెస్‌ను అంతర్మథనంలో పడేసిన దుష్యంత్‌కు కూడా బీజేపీ బహుమానం ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు.