వేలిముద్రలు.. ఇది నిజంగా షాకింగే!
సరికొత్త కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పనిచేసే 'డీప్ కాంట్రాస్టివ్ నెట్ వర్క్' వ్యవస్థను కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.
By: Tupaki Desk | 12 Jan 2024 3:30 PM GMTమనం క్రైమ్ సీరియళ్లు, మిస్టరీ నవలలు చూసినప్పుడు, చదివినప్పడు మనకు తెలిసే అంశం ఏమిటంటే.. ఒకరి వేలిముద్రలు మరొకరితో సరిపోలవు అని. ఎవరి వేలిముద్రలు వారికి మాత్రమే ప్రత్యేకమని.. వేరే వ్యక్తిని పోలి ఇంకో వ్యక్తి వేలిముద్రలు ఉండవనే ఇన్నాళ్లూ అందరూ నమ్ముతూ వచ్చారు. ఒకరి వేలిముద్రలు ఇంకో వ్యక్తితో మ్యాచ్ కావనే ఫోరెన్సిక్ నిపుణులు సైతం చెబుతూ వచ్చారు. చివరకు కవలలు (ట్విన్స్) అయినా ఒకరి వేలిముద్రలు ఒకరిని పోలి ఉండవని.. వేర్వేరుగానే ఉంటాయని భావించేవారు.
అయితే వేలిముద్రల గురించి మనకున్న అభిప్రాయాలు తప్పని ఒక పరిశోధన నిరూపించింది. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం.. కొలంబియా యూనివర్సిటీ వేలిముద్రలకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది.
ఈ మేరకు కొలంబియా విశ్వవిద్యాలయం ఇంజినీర్లు పరిశోధన నిర్వహించారు. సరికొత్త కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పనిచేసే 'డీప్ కాంట్రాస్టివ్ నెట్ వర్క్' వ్యవస్థను కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.
ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ డేటాబేస్ నుంచి సేకరించిన 60 వేల వేలిముద్రలను.. డీప్ కాంట్రాస్టివ్ నెట్ వర్క్ తో విశ్లేషించారు. కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తులకు చెందిన వేలిముద్రలను, మరికొన్నిసార్లు ఒకే వ్యక్తికి చెందిన వేళ్ల ముద్రలను పోల్చిచూస్తూ పరిశీలన చేశారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.
ఆశ్చర్యకరంగా ఒకే వ్యక్తికి సంబంధించిన వేర్వేరు వేళ్ల ముద్రలు కొన్ని కేసుల్లో సరిపోలుతుండటాన్ని కొలంబియా యూనివర్సిటీ ఇంజనీర్లు గుర్తించారు. అయితే వేలిముద్రలను పోల్చడంలో సంప్రదాయ విధానాలను కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని అనుసరించారు. ఈ నేపథ్యంలోనే కొలంబియా ఇంజినీర్లు నిర్ధారించిన కొత్త అంశంతో ఫోరెన్సిక్ నిపుణులు ఏకీభవించడం లేదు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫోరెన్సిక్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ బృందం తెలిపింది. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన హాడ్ లిప్సన్ మాట్లాడుతూ.. తన విద్యార్థుల్లో ఒకరు సంవత్సరం క్రితం తన బయోమెట్రిక్ తో సంబంధం లేకుండానే తన ఆఫీసులోకి అతడి బయోమెట్రిక్ తో వెళ్లగలిగాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి వేలిముద్రలు తన వేలిముద్రలతో ఎలా సరిపోయాయో తెలుసుకోవడానికే ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపారు. ఈ పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు.