ఇళ్లను కడగటానికి ఫైరింజన్లు.. వావ్.. వాటే ఐడియా బాబు
నిజానికి ఇలాంటి ఆలోచనే అదిరిపోతుందని చెప్పాలి. అంతేకాదు.. చుట్టూ నీళ్లు.. వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం వీల్లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ ఆలోచన కూడా భేషైనదిగా చెప్పాలి.
By: Tupaki Desk | 7 Sep 2024 10:01 AM GMTవరద తీవ్రత ఎలా ఉంటుంది? ముంపు కష్టం ఎంతలా ఉంటుంది? అన్న ప్రశ్నల్ని అలాంటి అనుభవాలు ఎదురుకాని వారిని అడిగితే.. అవేమీ పెద్ద విషయాలుగా ఫీల్ కారు. అందుకు భిన్నంగా గతంలో అలాంటి దారుణ అనుభవాల్ని ఎదురుచూసిన వారిని అడిగితే.. వారు చెబుతారు అదెంత కష్టమో. వరద విరుచుకుపడిన వేళ.. ప్రవాహంలా వచ్చే నీటితో పాటు.. మట్టి.. బురద కారణంగా జరిగే నష్టం అంచనాలకు మించి ఉంటుంది.
ఒక ఇల్లు ముంపు బారిన పడితే.. తక్కువలో తక్కువ ఇంటిని శుభ్రం చేయటానికి.. గతంలో ఎలాంటి కండీషన్ లో ఉందో అలా రావటానికి కనీసం అంటే రూ.25 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కూడా.. గోడలు శుభ్రంగా ఉంచేందుకు.. ఇంటిని పొడిగా మార్చుకునేందుకు. ఇక.. ఎంత డబ్బులు పెట్టినా సెట్ కాని మరో కష్టం ఉంటుంది. అది.. వరద నీరు ఇంట్లో ఉండి వెళ్లిపోయిన తర్వాత.. మిగిలే చెమ్మ వాసన. అది ఒక పట్టాన పోదు. ఒకవేళ.. ఇంటికి రంగులు వేద్దామనుకున్నా కుదరదు. ఎందుకంటే.. నీళ్లలో రోజుల తరబడి నానిన గోడలు పచ్చిగా ఉంటాయి. అవి పూర్తిగా ఆరేందుకు తక్కువనుకుంటే పది నుంచి ఇరవై రోజుల టైం తీసుకుంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. వరద ముంపు బారిన పడిన ఇళ్లు.. ఆ ఇంటి వారు ఎదుర్కొనే కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నింటికి మించి వరద ప్రవాహంతో కొట్టుకు వచ్చే బురద పెద్ద సమస్య. చేతి మీద కాలిన గాయం ఎలా అయితే.. ఆలస్యంగా మాని.. ఆ తర్వాత మచ్చగా ఉంటుందో.. ముంపు బారిన ఇళ్ల పరిస్థితి ఇంచుమించు అలానే ఉండే పరిస్థితి. ఇంటికి పట్టిన బురదను వదిలించుకోవటానికి పడే కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా.. చాలా త్వరగా పూర్తయ్యేందుకు ఫైరింజన్లను వాడాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేం.
నిజానికి ఇలాంటి ఆలోచనే అదిరిపోతుందని చెప్పాలి. అంతేకాదు.. చుట్టూ నీళ్లు.. వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం వీల్లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ ఆలోచన కూడా భేషైనదిగా చెప్పాలి. ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. దేశంలో ఇప్పటికి ఎన్నో ప్రాంతాల్లో వరద ముంపు విరుచుకుపడినా.. బాధితులకు ఆ కష్టాలను వీలైనంత త్వరగా అధిగమించేందుకు వీలుగా ఫైరింజన్లు.. డ్రోన్లను వినియోగించిన తీరును చూసినపపుడు.. విపత్తుల వేళ బాబు బుర్ర పాదరసం మాదిరి వేగంగా పని చేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. విజయవాడ వరద ముంపు సీఎం చంద్రబాబు సామర్థ్యాన్ని.. పనితనాన్ని మరోసారి అందరికి అర్థమయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.