సీరియస్ మేటర్.. వైసీపీ ఆఫీసుకు పోలీసుల నోటీసులు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గరలో ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Feb 2025 10:01 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గరలో ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో... జగన్ భద్రతపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ ఎక్స్ వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది.
మరోపక్క... "ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏమిటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?" అని టీడీపీ ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో.. ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా.. సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశించారు. జగన్ ఇంటివద్ద మంటల ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా.. ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. వైసీపీ ఆఫీసుకి ఎదురుగా ఉన్న గార్డెన్ లో మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం ఓ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఇది ఎవరైనా కావాలని చేసిన చర్యా.. లేక, ఆకతాయిల పనా.. అదీగాకపోతే టీడీపీ ఆరోపిస్తున్న విషయమా.. వైసీపీ ఆందోళన చెందుతున్న కారణమా.. అనేది తెలియాల్సి ఉంది.