Begin typing your search above and press return to search.

తెలంగాణ టూరిజం ఆఫీసులో నిప్పు.. కీలక ఫైళ్లు దగ్థం!

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తైన కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:40 AM GMT
తెలంగాణ టూరిజం ఆఫీసులో నిప్పు.. కీలక ఫైళ్లు దగ్థం!
X

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తైన కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివ్రద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. పలు ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన కార్యాలయంలోని కంప్యూటర్లు.. ఫర్నీచర్ తో పాటు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలు కాలి బూడిద కావటం షాకింగ్ గా మారింది.

భవనంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్రతకు కిటీకి అద్దాలకు ఉండే ఫైబర్ బీడింగ్ మంటలకు మెత్తబడి.. బిల్డింగ్ కింద ఉంచిన కారుపై పడటంతో కారు కూడా కాలిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల వేళలో డయల్ 100 ద్వారా నారాయణగూడ పోలీసులకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది.

దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. దాదాపు గంట పాటు శ్రమించిన అనంతరం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. కీలక అధికారి వద్ద ఉంచిన ఫైళ్లు కాలిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అర్థరాత్రి వేళ.. ఆఫీసులోకి దొంగచాటుగా ఎవరైనా ఆఫీసులోకి ప్రవేశించి.. నిప్పు పెట్టారా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కార్యాలయాన్ని సీపీఐ నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు. సస్పెన్షన్ కు గురైన పర్యాటక శాఖ ఎండీ మనోహర్ పై ఉన్నత స్థాయి విచారణ కోసం డిమాండ్ చేయటం గమనార్హం. ఈ వ్యవహారం అనంతరం.. రాబోయే రోజుల్లో మరెన్ని కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయో? అన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తుండటం విశేషం.