Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పబ్ లో కాల్పులు.. పోలీసుకు గాయాలు

అయితే..ఇతర పోలీసులు.. పబ్ సిబ్బంది సాయంతో సదరు నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Feb 2025 5:07 AM GMT
హైదరాబాద్ పబ్ లో కాల్పులు.. పోలీసుకు గాయాలు
X

రీల్ కు రియల్ కు మధ్యనున్న వ్యత్యాసం ఎంతో చెప్పే క్రైం సీన్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. కరుడుకట్టిన ఒక నేరస్తుడు గచ్చిబౌలిలోని ఒక పబ్ లోకి వెళ్లాడు.అతడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో సదరు నేరస్తుడు పిస్టల్ తో కాల్పులు జరపటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతంలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. అయితే..ఇతర పోలీసులు.. పబ్ సిబ్బంది సాయంతో సదరు నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఎత్తున కేసులున్న నిందితుడు.. మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొంది.. పోలీసులు అతడి కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నా తప్పించుకు తిరుగుతున్న బత్తుల ప్రభాకర్.. శనివారం సాయంత్రం ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో ఉన్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. వీరిని చూసిన ప్రభాకర్ తప్పించుకునేందుకు వీలుగా ప్రిజమ్ పబ్ లోకి వెళ్లాడు. పోలీసులు అతడ్ని వెంబడిస్తూ వెళ్లారు.

ఈ క్రమంలో పోలీసుల్ని తప్పించుకోవటానికి వీలుగా దేశీయ పిస్టల్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలోహెడ్ కానిస్టేబుల్ తొడలో తూటా దూసుకెళ్లింది. మరో ఇద్దరు బౌన్సర్లకు గాయాలు అయ్యాయి. అయితే.. వెంకట్రామిరెడ్డితో ఉన్న మిగిలిన కానిస్టేబుళ్లు.. పబ్ సిబ్బంది అందరూ కలిసి ప్రబాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని తనిఖీ చేయగా.. జాకెట్ లో మరో పిస్టల్ లభించినట్లుగా సైబరావాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.

బత్తుల ప్రభాకర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 దోపిడీ.. ఇంటి దొంగతనాల కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని ఇతగాడు టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. ఇటీవల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇతగాడి వేలిముద్రలు లభించినట్లుగా వెల్లడించారు. రెండేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చోరీలకు పాల్పడే సమయంలో ముఖానికి మాస్కు వేసుకోవటం.. వేలి ముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

తాను దొంగలించిన సొత్తుతో జల్సాలు చేసుకునే ప్రభాకర్.. తరచూ ప్రిజమ్ పబ్ కు వస్తాడన్న పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు..ప్లాన్ చేసి పట్టుకున్నారు. కాకుంటే.. అతగాడి వద్ద రెండు పిస్టల్స్ ఉంటాయన్న అంచనా విషయంలో మాత్రం ఫెయిల్ అయినట్లుగా చెప్పక తప్పదు. ఇతగాడు ఎంత ముదురు అంటే.. 2022లో ఏపీలోని విశాఖ జిల్లా పోలీసుల కళ్లు కప్పి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అంతేనా.. అనకాపల్లి కోర్టు నుంచి విశాఖ జైలుకు మార్చే వేలలో.. ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి జంప్ అయిన ఖతర్నాక్ దొంగ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కాడని చప్పాలి.