102 పార్లమెంటు స్థానాల్లో మైకులు బంద్.. రీజనేంటి?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 April 2024 6:05 AM GMTదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైన విషయం తెలిసిందే. మార్చి 16న ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు.. ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. దీనిలో తొలి దశ పోలింగ్.. ఈ నెల 19న అంటే.. శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో జరుగుతున్న రాజకీయ పార్టీల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా.. నాయకులు, పార్టీలు మైకులు బంద్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం 102 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 21 రాష్ట్రాలు(కొన్ని కొన్ని నియోజక వర్గాలు), కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాలకు కూడా.. తొలిదశలోనే ఎన్నికల పోలింగ్ జరిగిపోనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఈ రోజు సాయంత్రం వరకే ప్రచారానికి అనుమతి, అవకాశం ఉంటుంది. దక్షిణాదిలోని తమిళనాడు ఒక్కటే.. తొలి దశలో ఉండడం గమనార్హం.
ఇక, తొలిదశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ దీవులు, బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అన్ని ఈశాన్య రాష్ట్రాలు(అస్సాం, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం), జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ , బీజేపీల మధ్యే ప్రధాన పోరు ఉండనుంది.
అయితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల దూకుడు కూడా ఎక్కువగానే ఉంది. మరో కీలక విషయం ఏంటంటే.. తమిళనాడులో మాత్రం .. బీజేపీ నామమాత్రపు పోటీ ఉండగా.. ఇక్కడ ఇతర పార్టీలతో జట్టు కట్టింది. దీంతో ఎన్డీయే పోరు సాగనుంది. అయితే.. అధికార పార్టీ డీఎంకే కూడా బలమైన పోటీ ఇస్తుంది. మొత్తంగా చూస్తే.. 102 పార్లమెంటు స్థానాలకు ఈ రోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.